Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దేశవాళీలో ఇంతకుముందులానే ముంబై(Mumbai) జట్టుకే ఆడేందుకు సిద్ధమయ్యాడీ చిచ్చరపిడుగు. ఈ క్రమంలోనే నో అజ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) కోసం రాసిన లేఖను వెనక్కి తీసుకున్నాడీ యువకెరటం. అంతేకాదు వచ్చే రంజీ సీజన్లో తన పేరును పరిశీలించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA)కు అప్పీల్ చేసుకున్నాడు యశస్వీ.
దాంతో, ఈ యంగ్‌స్టర్ రాకతో తమ జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతుందనుకున్న గోవాకు నిరాశే మిగిలింది. వచ్చే దేశవాళీ సీజన్‌కు తనను ముంబై క్రికెటర్‌గానే పరిగణించాలని యశస్వీ ఎంసేఏకు లేఖ రాశాడని పీటీఐ పేర్కొన్నది. ‘వచ్చే ఏడాది నుంచి గోవాకు దేశవాళీ క్రికెట్ ఆడాలనే ఆలోచనను విరమించుకున్నా. అందుకే.. ఎంసీఏ నుంచి నో అజ్జెక్షన్ సర్టిఫికెట్ కోరుతూ రాసిన లేఖను ఉపసంహరించుకుంటున్నా.
🚨 YASHASVI JAISWAL MAKES A U-TURN 🚨
– Jaiswal want to continue playing for Mumbai, he has requested MCA to withdraw the NOC issued to him. [Devendra Pandey from Express Sports] pic.twitter.com/p1P23PJVNn
— Johns. (@CricCrazyJohns) May 9, 2025
సో.. త్వరలో మొదలయ్యే డొమెస్టిక్ సీజన్లో నన్ను ముంబై ఆటగాడిగానే గుర్తించాలని ఎంసీఏకు మనవి చేసుకుంటున్నాను. ఇప్పటివరకైతే నేను బీసీసీఐకి గానీ, గోవా క్రికెట్ సంఘానికి గానీ ఎన్ఓసీని సమర్పించలేదు’ అని యశస్వీ వెల్లడించాడు.
టీమిండియా భవిష్యత్ తారగా ఎదుగుతున్న యశస్వీ అండర్ -19 నుంచి ముంబైకి ఆడుతున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 2019లో ఆ జట్టు తరఫునే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ యంగ్‌స్టర్ 53.93 సగటుతో 863 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్.. 181.
అయితే.. గత సీజన్లో ముంబై సారథి అజింక్యా రహానే(Ajinkya Rahane) కిట్ బ్యాగ్‌ను యశస్వీ తన్నాడని.. అందుకే అతడిని పక్కన పెట్టేశారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే యశస్వీ జట్టు మారాలని నిర్ణయించుకున్నాడు. ముంబైకి గుడ్ బై చెప్పేసి గోవా తరఫున బరిలోకి దిగాలని అనుకున్నాడు. కానీ, చివరకు తన ఆలోచనను విరమించుకొని.. మళ్లీ తన సొంత టీమ్‌కే ఆడేందుకు సన్నద్ధం అవతున్నాడీ కుర్రాడు.