ICC Test Rankings : స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వైఫల్యానికి భారత స్టార్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. మూడు టెస్టుల సిరీస్‌లో ఒకే ఒక అర్ధ శతకంతో నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ర్యాంకింగ్స్ వెనకబడ్డారు. ఐసీసీ బుధవారం ప్రకటించిన పురుషుల టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ ఏకంగా 8 స్థానాలు కోల్పోయాడు.
ఒకప్పుడు నంబర్ 1 ర్యాంకలో నిలిచిన రన్ మెషిన్ ఇప్పుడు 22వ ర్యాంకులో ఉన్నాడు. ఇక హిట్‌మ్యాన్ సైతం పలు స్థానాలు దిగజారి 26వ స్థానంలో నిలిచాడు. సొంతగడ్డపై ముగిసిన టెస్టు సిరిస్‌లో కివీస్ బౌలర్లను ఉతికేసిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ మాత్రం తన ర్యాంకు మెరుగుపరుచుకున్నారు.
Rishabh Pant and Daryl Mitchell move into the top 10 after the recent #INDvNZ series 🙌 pic.twitter.com/D1wyVSMegM
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2024
విధ్వంసక ఆటగాడైన యశస్వీ 804 పాయింట్లతో 4వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. వాంఖడేలో న్యూజిలాండ్ బౌలర్లను ఎదిరిస్తూ సూపర్ ఫిఫ్టీ బాదిన పంత్ 750 పాయింట్లతో ఆరో ర్యాంక్ సాధించాడు. టీమిండియా నుంచి యశస్వీ, పంత్ ఇద్దరే టాప్ -10లో చోటు దక్కించుకున్నారు.
ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ 903 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ 804 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీతో రికార్డులు బద్ధలుకొట్టిన ఇంగ్లీష్ జట్టు చిచ్చరపిడుగు హ్యారీ బ్రూక్ 3వ ర్యాంక్ కొల్లగొట్టాడు.
భారత పర్యటనలో విశేషంగా రాణించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ 7 స్థానం సాధించగా.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో శతకాలతో చెలరేగిన పాకిస్థాన్ స్టార్ సాద్ షకీల్ 9వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 8 వ ర్యాంక్, మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ 10వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.