న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. డోనాల్డ్ ట్రంప్ దుమ్మురేపుతున్నారు. ఓట్ల లెక్కింపులో ఆయన పార్టీ దూసుకెళ్తున్నది. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో ఆయన పార్టీ గెలుపు దిశగా వెళ్తున్నది. ఇప్పటికే జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో రిపబ్లికన్లు విజయం సాధించారు. ప్రస్తుతం విస్కిన్సన్(Wisconsin)లో కూడా ఆయన పార్టీ నెగ్గింది. దీంతో అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారు అయ్యారు. రిపబ్లికప్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లను దాటేసింది. ఆ పార్టీకి ఇప్పుడు 279 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు దక్కేశాయి. దీంతో కమలా హ్యారిస్ ఆశలకు గండి పడింది.
8 ఏళ్ల క్రితం హిల్లరీ క్లింటన్‌కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ తర్వాత 2020లో జో బైడెన్ చేతిలో పోరాడి ఓడారు. ఇప్పుడు మళ్లీ వైట్‌హౌజ్ రేసులో నిలిచి గెలిచారు. జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్ అటాక్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్.. అనేక కోర్టు కేసుల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. రెండు అంశాల్లో ట్రంప్‌పై అమెరికన్లు విశ్వాసం చూపినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇమ్మిగ్రేషన్, ఆర్థిక అంవాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.