T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నీకి నెల రోజుల సమయం ఉందంతే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) వేదికగా విశ్వ క్రికెట్ పండుగ మొదలవ్వనుంది. ఇప్పటికే దాదాపు అన్ని దేశాలు ఈ టోర్నీ కోసం స్క్వాడ్లను ప్రకటించేశాయి. దాంతో, ఆనవాయితీ ప్రకారం వరల్డ్ కప్ ట్రోఫీ టూర్(T20 World Cup Trophy Tour)ను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం దుబాయ్‌లోని ప్రసిద్ధ ప్రాంతాల్లో తళుక్కుమన్న వరల్డ్ కప్ ట్రోఫీ అభిమానులను మనసు దోచుకుంది. ఇక క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే భారత్‌లోనూ వరల్డ్ కప్ ట్రోఫీ అడుగుపెట్టనుంది. అవును.. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం భారత్‌కు రానుంది. మొదట బెంగళూరలో ట్రోఫీని ప్రదర్శించనున్నారు.
కర్నాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్లో ట్రోఫీని ప్రదర్శనకు ఉంచుతారు. అనంతరం బెంగళూరులోని నెక్సస్ మాల్, ఇన్ఫినిటీ మాల్లో సందర్శకులు వరల్డ్ కప్‌ను చూసేందుకు అనుమితిస్తారు. ఇక సెప్టెంబర్ 10వ తేదీన ముంబైకి ట్రోఫీ తరలి వెళ్లనుంది. సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత వరల్డ్ కప్ ట్రోఫీని శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చేరవేస్తారు. అక్కడి నుంచి నేరుగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న యూఏఈకి ట్రోఫీ చేరుకుంటుంది.
బంగ్లాదేశ్‌లో గత నెలలో చెలరేగిన ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో వరల్డ్ కప్ వేదికను యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. మహిళల టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 3న మొదలవ్వనుంది. తొలి పోరులో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనుననాయి. మొత్తం 18 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించనున్న ఈ మెగా టోర్నీలో విజేత ఎవరో అక్టోబర్ 20న తేలిపోనుంది.