హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఒకే విధానం తీసుకొచ్చేలా సంస్కరణలకు రంగం సిద్ధమైంది. ఇందుకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అధ్యక్షత జరిగిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం వేదిక అయింది. దాదాపు 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గతంలో చివరిసారిగా 1999 సంవత్సరంలో ఇటువంటి సమావేశం జరిగింది. తాజాగా జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణి కుముదిని కూడా హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఒకే విధానం తీసుకురావడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, ఓటర్ల జాబితా రూపకల్పన, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. దీని ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయి.