హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఉత్త ప్రణాళిక మాత్రమేనని, అది కార్యరూపం దాల్చేందుకు వందేండ్లు పట్టవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీన్ని సాకుగా చూపి తెలంగాణ నీటి కేటాయింపులను కోరడం అసమంజసమని పేర్కొన్నది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఢిల్లీలో చేపట్టిన విచారణ మంగళవారం సైతం కొనసాగింది. కృష్ణా డెల్టా వ్యవస్థ (కేడీఎస్)పై ఏపీ తరపున సీనియర్ అడ్వకేట్ జయదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధితో పట్టణీకరణ జరిగి మొ త్తంగా కేడీఎస్ అవసరాల్లో 15.78 టీఎంసీల జలాలు ఆదా అవుతాయని తెలంగాణ వాదించడం తప్పని చెప్పారు.
అలా ఆదా అయ్యే నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరడం అసమంజసమని తెలిపారు. తెలంగాణ వాదనలు నిరాధారమైనవని పేర్కొన్నారు. సీఆర్డీఏ చట్టం-2014 ప్రకారం ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి అనేది ఒక ముసాయిదా దృక్పథ ప్రణాళిక మాత్రమేనని, అది కార్యరూపం దాల్చేందుకు వందేండ్లు పట్టవచ్చని వెల్లడించారు. ఆ ముసాయిదాను గెజిట్ చేయలేదని, దానికి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. అనంతరం ఈ విచారణను మార్చి 23, 24, 25కు వాయిదా వేస్తున్నట్టు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించింది.