Harish Rao | కల్యాణలక్ష్మి చెక్కుల కోసం తొలిసారిగా హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని వీపంచి కళానిలయంలో కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 500 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు. పథకం తొలిసారిగా రూ.50వేలతో ప్రారంభమైందని.. అప్పటి సీఎం కేసీఆర్ ఆ తర్వాత రూ.లక్షకు పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వడం లేదన్నారు. త్వరగా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు సైతం మాయమైపోతున్నాయన్నారు. అందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని.. తుది శ్వాస వరకు మీ సేవలోనే ఉంటానన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద హరీశ్‌రావు ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఖమ్మం మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని.. సిద్దిపేట నుంచి ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందురూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. రాష్ట్రంలో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు. ముందుగా ప్రభుత్వం మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నెలవేతనం బాధితులకు అందజేస్తున్నామన్నారు. మిగతా పార్టీలు సైతం సహాయం చేసుందుకు ముందుకురావాలన్నారు. తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారన్నారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని తెలిపారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్నారు. బీఆర్ఎస్కు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారన్నారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేక పోయారని.. ఇండ్లు నీళ్లలో మునిగిపోయిన వారికి రూ.2లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.