Wimbledon : వింబుల్డన్ .. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మస్త్ పాపులర్. ఒక్కసారైనా వింబుల్డన్ (Wimbledon) టైటిల్ గెలవాలని ఆశ పడని ఆటగాళ్లు ఉండరు. ప్రతి సీజన్లో ఉత్కంఠ పోరాటాలతో అభిమానులను అబ్బురపరిచే ఈ టోర్నీ ఇకపై కొత్తగా ఉండనుంది. 147 ఏండ్ల చరిత్రలో కీలక మార్పు దిశగా నిర్వాహకులు అడుగులు వేస్తున్నారు. లైన్ అంపైర్‌తో.. లైన్ జడ్జిలతో ఆటగాళ్ల వివాదాస్పద నిర్ణయాలకు తెరదించేందుకు సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నారు. అందులో భాగంగానే లైన్ జడ్జిలకు బైబై చెప్పేసి.. ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ (Electronic Line Calling) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.
వచ్చే వింబుల్డన్ టోర్నీలో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ వెల్లడించింది. అలాగని ఈ కొత్త వ్యవస్థను హడావిడిగా ఏమీ తేవడం లేదు. అవును.. వింబుల్డన్ 2024లోనే ఈఎల్‌సీ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. లైన్ జడ్జిల కంటే కచ్చితత్వంతో ఈఎల్‌సీ ద్వారా నిర్ణయం తీసుకోవడం సాధ్యపడింది. అందుకని 2025 నుంచి వింబుల్డన్‌లో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు.