Arctic Open : పారిస్ ఒలింపిక్స్‌లో కొద్దిలో కాంస్యం చేజార్చుకున్న భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) మరోసారి నిరాశపరిచాడు. ఆర్కిటిక్ ఓపెన్(Arctic Open)లో ప్రీ- క్వార్టర్ ఫైనల్లోనే ఓటమిపాలయ్యాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత ఆటగాడు ఊహించని పరాయజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. చైనీస్ తైపీకి చెందిన చౌ థియెన్ చెన్‌తో గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ చివరిదాకా పోరాడిన మ్యాచ్ గెలవలేకపోయాడు. మరో మ్యాచ్‌లో కిరన్ జార్జ్ సైతం ఇంటిదారి పట్టాడు.
విశ్వ క్రీడల్లో అదరగొట్టిన లక్ష్యసేన్ ఆర్కిటిక్ ఓపెన్‌లోనూ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. చౌ థియెన్పై తొలి సెట్ గెలుపొందిన అతడు రెండు, మూడు సెట్లలో అదే జోరు కొనసాగించలేకపోయాడు. మొదటి సెట్ కోల్పోయిన చౌ థియెన్ పుంజుకొని దూకుడైన ఆటతో సేన్‌కు చెక్ పెట్టాడు. దాంతో, 70 నిమిషాల పాటు సాగిన ఉత్కంఠ పోరులో భారత బ్యాడ్మింటన్ కెరటం 21-19, 18-21, 15-21తో ఓడిపోయాడు.
Olympic revenge is taken. Lakshya Sen lost to Chou Tien Chen in 3 games in Round of 16 at Arctic Open 2024 pic.twitter.com/R1iyqOL6Pb
— Shreya Jha (@shreya_jha_s2) October 10, 2024
ఇక మహిళల సింగిల్స్‌లో సైతం భారత మహిళలు ముందంజ వేయలేకపోయారు. మాళవిక బన్సోద్, ఉన్నాటి హుడా, ఆకర్షిణి కశ్యపలు రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. థాయ్‌లాండ్ క్రీడాకారిణి రచనొక్ ఇటనోన్ చేతిలో మాళవిక 15-21, 8-21తో చిత్తుగా ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఉన్నాటి హుడాకు కెనడా అమ్మాయి మిచెల్లీ లీ చెక్ పెట్టింది. రెండో సీడ్ చైనా షట్లర్ హన్ యూ ధాటికి చేతులెత్తేసిన ఆకర్షిని ఓటమి మూటగట్టుకుంది.