Srisailam | శ్రీశైలం : దసరా మహోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదోజైన గురువారం దుర్గాష్టమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారు మహాగౌరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. నందిని వాహనంగా చేసుకొని చేతుల్లో వర, అభయ ముద్రలతోపాటు త్రిశూలం, ఢమరుకాన్ని ఆయుధాలగా ధరించి దివ్యకాంతులను ప్రసరింపజేస్తు తెల్లనిరంగులో శాంతస్వరూపిణిగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.
సాయంత్రం అక్క మహాదేవి అలంకార మండపంలో నందివాహనంపై భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను వేంచేపు చేసి రుత్వికులతో శాస్త్రోక్తంగా పూజలు జరిపించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఉత్సవాల్లో పలు రాష్ట్రాలకు చెందిన జానపదాలు, కోలాటాలు, చెక్కభజన, బీరప్పడోలు, నందికోలు, బుట్టబొమ్మలు, ఢమరుకనాదాలు, సప్తస్వర విన్యాసాలు, కర్ణాటక డప్పు కళాకారుల వీరంగ నృత్యాలతోపాటు వివిధ రకాల కళారూపాలతో భక్తులను ఆకట్టుకున్నాయి.