Kozhikode : భారీ ఆఫర్లు అంటే చాలు.. జనం ఎగబడి పోతున్నారు. వ్యాపార సంస్థలేమో జనాన్ని ఆకట్టుకునేందుకు రకరకాల ట్రిక్స్ ప్రయోగిస్తున్నాయి. ఇలాంటి ప్రకటనలతో గందరగోళ వాతావరణం ఏర్పడుతున్నా జనాలు మారడం లేదు. తాజాగా కేరళలో ఒక షాపు యాజమాన్యం ప్రకటించిన ఆఫర్.. చివరికి వినియోగదారులపై లాఠీఛార్జి వరకు వెళ్లింది. కేరళలోని, కోజికోడ్‌కు చెందిన ఒక ఫుట్‌వేర్ షాపు తాజాగా ఒక ఆఫర్ ప్రకటించింది.
ఒక్క రూపాయికే ప్రీమియం షూస్ అందిస్తామని ప్రకటించింది. కాకపోతే.. అది రూపాయి నోటు తీసుకొస్తేనే. ఒక్క రూపాయి నోటు తీసుకొచ్చిన మొదటి 100 మందికి ఆదివారం ఉదయం తమ షాప్ వద్ద ప్రీమియమ్ షూస్ అందిస్తామని యాజమాన్యం ప్రకటించింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ ఆఫర్‌కు ఆకర్షితులయ్యారు. వందల సంఖ్యలో, రూపాయి నోటుతో ఆదివారం షాపు వద్దకు చేరుకున్నారు. కొందరైతే శనివారం అర్ధరాత్రి రెండు గంటల నుంచే షాపు వద్దకు చేరుకున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా జనాలు వచ్చారు. ఆదివారం ఉదయం కల్లా జనాలు భారీగా పోగయ్యారు. దీంతో ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
అర్ధరాత్రి నుంచే జనాలు వేచి ఉండటం, భారీ సంఖ్యలో కస్టమర్లు రావడంతో షాపు వద్ద గందరగోళ పరిస్తితి తలెత్తింది. వందల సంఖ్యలో జనాలు ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఉన్నారు. అనేకసార్లు తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి పరిస్తితి అదుపుతప్పడంతో కస్టమర్లపై లాఠీఛార్జి ప్రయోగించాల్సి వచ్చింది. ఎలాగోలా పోలీసులు జనాల్ని చెదరగొట్టారు. అయితే, దీనంతటికీ కారణమైన షాపు యాజమాన్యాన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.