Hyderabad | హక్కుల సాధనకు కోసం ఐక్య పోరాటానికి సిద్ధంగా ఉన్నామని బ్రాహ్మణ సంఘాల నేతలు ప్రకటించారు. బ్రాహ్మణ సంఘం నేత దోర్నాల కృష్ణమూర్తి అధ్యక్షతన 200 సంఘాలకు చెందిన నేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్‌పై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 30 నుంచి 40లక్షల మంది బ్రాహ్మణులు నివసిస్తున్నారన్నారు. సంఘ సభ్యులకు సమాజంలో గుర్తింపు లేదని.. కనీసం ఓట్లు అడిగే వారు కూడా ఎవరూ లేరన్నారు. ఇతర సామాజికవర్గాల తరహాలో రాజకీయ ఫలాలు తమకు అందుకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర దేశాల్లో దాదాపు 5 నుంచి 7లక్షల మంది బ్రాహ్మణ విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారన్నారు. అన్ని రకాల వృత్తులు ఒకేతాటిపైకి వచ్చి హక్కుల సాధనకు ఐక్యతగా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అన్నిటికంటే ముందు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆ తర్వాత రాజకీయంగా తమకు మద్దతు అందిస్తే.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతామన్నారు. త్వరలోనే వార్డుల వారీగా మీటింగ్‌లు ఏర్పాటు చేసి.. బ్రాహ్మణుల గణాంకాలను తీసుకొని హక్కుల సాధన కోసం పోరాడుతామన్నారు. నవంబర్‌లో వనసమారాధ నిర్వహిస్తామని.. దీనికి జంటనగరాల్లో ఉన్న బ్రాహ్మణులు తరలివస్తారని తెలిపారు. ఇక ఈ సమావేశానికి పానుగంటి చంద్రమౌళి, గంగు నరసింహమూర్తి కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు.