Stock Market : ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గతవారం నష్టాల్లోనే ముగిసిన ట్రేడింగ్ సోమవారం ఉదయం కూడా నష్టాల్లోనే ప్రారంభమైంది. ఉదయం 9.28 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 2,444.51 పాయింట్లు నష్టపోయి, 76,474.39 పాయింట్ల వద్ద కొనసాగింది. నిఫ్టీ కూడా 729.90 పాయింట్లు నష్టపోయి 23,720.55 పాయింట్ల వద్ద కొనసాగింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే దాదాపు రూ.12 లక్షల కోట్లకుపైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
అంతర్జాతీయ పరిణామాలు, గల్ఫ్ యుద్ధం, చమురు ధరలు పెరగడం వంటివి స్టాక్ మార్కెట్ల నష్టానికి కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం రూపాయి 92.25 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ప్రారంభా కాగానే ఇన్వెస్టర్లు ఎక్కువగా అమ్మకాలకు పాల్పడ్డారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ఇండియాలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు ధరల దెబ్బకి మార్కెట్ మరింత దిగజారే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు డా.విజయ్ కుమార్ అన్నారు. చమురు ధరల ప్రభావం సామాన్యుడిపై పడితే ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటింది. మరోవైపు ఆసియన్ మార్కెట్లు కూపడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
అందులోనూ సౌత్ కొరియా కొస్పి వరుసగా 4 సెషన్లలో రెండోసారి సర్క్యూట్ బ్రేకర్‌ను తాకింది. దీంతో 8 శాతం సూచీ పడిపోయింది. ఫలితంగా 20 నిమిషాలపాటు ట్రేడింగ్ నిలిపివేశారు. జపాన్ నిక్కీ, అమెరికన్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీలో కోల్ ఇండియా స్టాక్ ఒక్కటే లాభాల్లో ట్రేడవుతోంది. టాటా స్టీల్, మారుతీ సుజుకి, ఎస్బీఐ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై దీర్ఘకాలిక ప్రభావం చూపబోవని, అందువల్ల పెట్టుబడిదారులు ఓపికతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.