తిరువనంతపురం: కేరళ సీఎం వీడీ సతీశన్(VD Satheesan) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సంప్రదాయ వంటలకు చెందిన చిట్కాలను, విధానాలను కోడళ్లకు నేర్పించాలని ఆయన సూచన చేశారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. చెంగనూరులో శనివారం జరిగిన పంపా ఫెస్టివల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కొందరు తల్లులపై తాను ఫిర్యాదు చేయదలుచుకున్నట్లు చెప్పారు. సంప్రదాయకర, రుచికరమైన వంటల్ని చేసే ట్యాలెంట్ మహిళలకు ఉందని, కానీ తమ పిల్లలకు ఆ ట్యాలెంట్‌ను పాస్ చేయడం లేదని ఆయన అన్నారు. అయితే ఆ రుచికరమైన, బలవర్దకమైన వంటల్ని చేసే విధానాన్ని తమ పిల్లలకు పాస్ చేయాలని, లేదంటే కనీసం కోడళ్లకు అయినా చెప్పాలని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలా చేస్తేనే ఆ వంటల్లో ఉన్న ప్రత్యేకత రాబోయే తరలాలకు అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ సీఎం సతీశన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు సెక్సియస్ట్గా ఉన్నాయని, లింగబేధాన్ని సూచిస్తున్నట్లుగా ఉందని కొందరు ఆరోపించారు.
మాజీ విద్యాశాఖ మంత్రి, సీనియర్ సీపీఐ నేత వీ శివన్కుట్టి.. సీఎం సతీశన్ వ్యాఖ్యలను ఖండించారు. లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఆ వ్యాఖ్యలు ఉన్నట్లు చెప్పారు. కేరళ స్కూల్ పాఠ్యాంశాలకు భిన్నంగా సీఎం మాట్లాడినట్లు ఆయన ఆరోపించారు. తన ఫేస్బుక్ పోస్టులో విమర్శిస్తూ.. ఆడ, మగ తేడా లేకుండా ఇంట్లో పని ప్రతి ఒక్కరు చేయాలని, అలాంటి పాఠ్యాంశాలను తాము ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. జెండర్ ఆధారంగా ఇంటి బాధ్యతలను అప్పగించరాదు అని, ఇంటి పనిని సమానంగా పంచుకునేందుకు అమ్మాయిలు, అబ్బాయిలకు పాఠ్యాంశాలను రూపొందించినట్లు చెప్పారు. రచయిత శారదాకుట్టి తన సోషల్ మీడియా పోస్టులో సీఎం సతీశన్‌ను తప్పుపట్టారు. సీఎం వ్యాఖ్యలు పితృస్వామ్య ఆధిపత్యాన్ని చూచిస్తున్నాయన్నారు.