Cocaine Seized | దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం రమేశ్‌నగర్‌లో దాదాపు 200 కిలోల కొకైన్ పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని ధర రూ.2వేలకోట్లకుపైగా ఉంటుందని అంచనా. నైరుతి ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో రూ.5వేలకోట్లపైగా విలువైన 562 కిలోల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. పశ్చిమ ఢిల్లీలోని రమేశ్‌నగర్ ప్రాంతంలో దాడులు కొనసాగుతున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకరిని అరెస్టు చేశామని.. నిందితుడిని మహ్మద్ షఫీగా గుర్తించారు. రమేష్ నగర్లో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న గోదాములో డ్రగ్స్‌ను ఉంచిన వ్యక్తి బ్రిటిష్ పౌరుడు కాగా.. కొకైన్‌ను అక్కడే ఉంచి అతను పరారయ్యాడు. ఇంతకు ముందు అక్టోబర్ 2న మహిపాల్పూర్ ప్రాంతంలోని ఓ గోదాం నుంచి 560 కిలోలకుపైగా కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో ఒకరు యూత్ కాంగ్రెస్ మాజీ సభ్యుడని వార్తలు వచ్చాయి. అయితే, అతనితో పార్టీకి సంబంధం లేదని.. పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా కాంగ్రెస్ పేర్కొంది. పోలీసులు గతవారం రోజుల వ్యవధిలోనే రూ.7వేలకోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ పట్టుబడిన కొకైన్.. గతంలో దొరికిన డ్రగ్స్‌కు లింక్ ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.7500కోట్ల విలువైన 672 కిలోల మాదకద్రవ్యాలను సీజ్ చేశామని.. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ రవాణా ఇదేనని పేర్కొన్నారు. ఇందులో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ రవాణాపై దృష్టి సారించి.. ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.