Virat Kohli | భారత (Indian) స్టార్ బ్యాటర్ (Star batter) విరాట్ కోహ్లీ (Virat Kohli) దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇవాళ ఢిల్లీ (Delhi), రైల్వేస్ (Railways) జట్ల మధ్య ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో.. కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అందరి చూపూ కోహ్లీ వైపే ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో (Arun Jaitley Stadium) జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. స్టేడియం బయట దాదాపు 2కి.మీల మేర క్యూలో ఫ్యాన్స్ నిల్చున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.
గేట్ నంబర్ 16 వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. సెక్యూరిటీ గార్డ్‌కు కూడా గాయాలైనట్లు తెలిసింది. ఓ పోలీసు బైక్ కూడా ధ్వంసమైంది. ఈ ఘటనతో మైదానం వెలుపల గందరగోళ పరిస్థితి తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. మరోవైపు ఓ అభిమాని కోహ్లీని కలుసుకునేందుకు భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి దూసుకెళ్లాడు. అక్కడ కోహ్లీ వద్దకు వెళ్లి పాదాలను తాకాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సదరు వ్యక్తిని అక్కడి నుంచి బయటకు పంపించారు.
కాగా రంజీ ట్రోఫీ గ్రూప్-Dలో ఢిల్లీ.. ఒక గెలుపు, రెండు ఓటములు, మూడు డ్రాలతో ఆరో స్థానంలో ఉన్నది. సౌరాష్ట్రతో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇండియన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున 12 వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. కాగా 36 ఏళ్ల విరాట్ కోహ్లీ 2012 ఉత్తరప్రదేశ్‌లో తన ఆఖరి రంజీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు మళ్లీ ఆడబోతున్నాడు.
Also Read..
Ranji Trophy | రంజీ రేసు రసవత్తరం.. అందరి చూపు కోహ్లీ వైపే
Virat Kohli | రైల్వేస్‌తో రంజీ మ్యాచ్‌కు వేగంగా సన్నద్ధమవుతున్న విరాట్ కోహ్లీ