(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : భూమి మీద అంతటా గాలి ఉన్నట్టు తాగడానికి నీరు కూడా ఉంటే ఎంత బాగుంటుందో?.. నీటి ఎద్దడిని ఎదుర్కొన్న వారికి ఎప్పుడో ఒక్కప్పుడు ఈ భావన కలిగే ఉంటుంది. దీన్ని నిజం చేస్తూ.. గాలి నుంచి స్వచ్ఛమైన నీటిని సేకరించే అత్యాధునిక మెషీన్ను నోబెల్ ఆవార్డు గ్రహీత ఓమర్ యాఘీ తాజాగా అభివృద్ధి చేశారు. దీని సాయంతో రోజుకు కనీసం వెయ్యి లీటర్ల శుద్ధమైన నీటిని గాలి నుంచి సేకరించవచ్చని చెప్తున్నారు.
నేల మీద పడిన నీటిని స్పాంజీ ఎలాగైతే పీల్చుకొంటుందో.. గాలిలోని తేమను, కార్బన్ అణువులను పీల్చుకోవడానికి మాలిక్యులర్ స్పాంజీల సాయంతో యాఘీ ఓ మెషీన్ను తయారు చేశారు. తాను స్థాపించిన అటోకో కంపెనీ నుంచి ‘మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్’ పేరిట ఈ మెషీన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యుత్తు అవసరం లేకపోయినప్పటికీ, సూర్యరశ్మి సాయంతోనే ఈ మెషీన్ పని చేయగలదని ఆయన పేర్కొన్నారు. ఎడారి ప్రాంతంలోని గాలిలో తేమ 20 శాతం కంటే తక్కువగా ఉంటుందని, అలాంటి సందర్భాల్లోనూ ఈ మెషీన్ చక్కగా పని చేయగలదని తెలిపారు.
భూమి మీద ఉన్న మొత్తం నదుల్లోని నీటితో పోలిస్తే, గాలిలో నీరు ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. భూగర్భంలో ఉన్నట్టు ఉప్పు, ఖనిజాలు, ఇతర మలినాలు గాలిలో ఉండవని, దీంతో గాలి నుంచి సేకరించిన నీరు ఎంతో శుద్ధమైనదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది ప్రజలు శుద్ధమైన నీటి కొరతతో అల్లాడిపోతున్నారని, తమ ప్రయోగంతో భవిష్యత్తు నీటి కష్టాలను తీర్చవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.