నారాయణపేట : నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో చేపడుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ( Kodangal Lift ) పథకంలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గురువారం లోకాయుక్తకు ఫిర్యాదు ( Lokayukta Complaint ) చేశారు.
బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి ( Rajendhar Reddy ) , మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో నారాయణపేట మండలం పేరపల్ల గ్రామ శివారులో చేపట్టిన భూముల సేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపించారు.
నకిలీ పాస్బుక్ లతో నష్ట పరిహారాన్ని కాజేసేందుకు కాంగ్రెస్ నాయకులు పన్నాగం పన్నారని విమర్శించారు. పేరపల్ల శివారులోని జయమ్మ చెరువులో నీరు నిల్వ చేయడం వల్ల కొంత మంది రైతులకు సంబంధించి భూములు కొల్పోకున్న, భూములు కోల్పోతున్నట్లు పేర్కొనడం, సర్వే నంబర్లూ ఒక చోట ఉంటే భూములు ఒక చోట ఉన్నట్లు అధికారులు చెప్పడం రైతులను అయోమయానికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా, ప్రాజెక్టు పనుల్లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
విచారణలో అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తేలితే సంబంధిత అధికారులపై, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను కోరినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్రతి రూపాయి ప్రజాధనం సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లోకాయుక్త విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.