Supreme Court : అధిక మోతాదులో ఉప్పు (Salt), చక్కెర (Sugar), సంతృప్త కొవ్వులు ఉండే ఆహార పదార్థాల ప్యాకెట్ల (Food Pace) పై లేబుల్స్ ఏర్పాటుచేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం గట్టి హెచ్చరిక చేసింది. ‘మీరు చేయలేకపోతే మేమే చేస్తాం’ అంటూ కేంద్రానికి తేల్చిచెప్పింది. ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో కార్పొరేట్ ఒత్తిళ్లకు తలొగ్గకూడదని స్పష్టంచేసింది.
జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించింది. ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI)’ వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వుల గురించి అవగాహన కలిగించేందుకు ప్యాకెట్ల ముందు భాగంలో స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ విషయంలో ఆహార పరిశ్రమ అభ్యంతరాలను మాత్రమే FSSAI పరిగణనలోకి తీసుకుందన్నారు. ఆహార ప్యాకెట్లపై హెచ్చరిక గుర్తులకు బదులుగా అదనపు చక్కెర, సంతృప్త కొవ్వులు, ఉప్పు మొదలైన వాటిని రోజుకు ఎంత తీసుకోవచ్చో పట్టిక రూపంలో చూపించే విధానాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. అయితే ఈ విధానం వినియోగదారులకు అవసరమైనంత అవగాహన అందించదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని, ఇప్పటివరకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది.
హెచ్చరిక లేబుల్స్ వల్ల ఉత్పత్తుల విక్రయాలపై ప్రభావం పడుతుందని తయారీదారులు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని కోర్టు పేర్కొంది. అయితే తాము తినే ఆహారంలో ఎంత చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు ఉందో తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని స్పష్టంచేసింది. హెచ్చరిక ఉన్నప్పటికీ ఉత్పత్తిని కొనాలా, వద్దా అనే తుది నిర్ణయం వినియోగదారుడిదేనని తెలిపింది. హెచ్చరిక లేబుల్స్కు సంబంధించిన ప్రతిపాదనపై చర్యలు తీసుకునేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణ సమయంలో అవసరమైతే తుది ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది.