కట్టంగూర్, ఆగస్టు 13 : కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హమాలీలకు వెంటనే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి పి.సైదులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కట్టంగూర్ తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హమాలీలకు హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు జారీ చేసి ఈ-శ్రమ్‌లో నమోదు చేయాలని కోరారు. 55 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.6 వేల పెన్షన్, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. 50 కిలోలకు మించిన బరువుల మోయడాన్ని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ నాయకుడు బండారు మధు, హమాలీ సంఘం నాయకులు అయితగోని వెంకన్న, నర్సింగ్ వెంకన్న, పొడిచేటి జానయ్య, పల్స యాదయ్య, రాములు పాల్గొన్నారు.