బ్రిస్బేన్: భారత్‌తో స్వదేశంలో ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్‌లో ఓడిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం విజయంతో ఆరంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనను 6 వికెట్ల తేడాతో ఓడించింది. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేస్తూ 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును స్మృతి మంధాన (58), హర్మన్‌ప్రీత్ (53) ఆదుకున్నారు. మహిళల వన్డే ప్రపంచకప్ తర్వాత తొలి మ్యాచ్ ఆడిన ప్రతీక డకౌట్ అవగా షెఫాలీ, జెమీమా, దీప్తి సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు.
ఆఖర్లో కాశ్వీ గౌతమ్ (43) రాణించడంతో 48.3 ఓవర్లకు భారత్ 214 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ప్రత్యర్థి ఎదుట ఉంచగల్గింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డ్నర్ (3/33), మేగన్ షట్ (2/42) రాణించారు. లక్ష్యాన్ని కంగారూలు 38.2 ఓవర్లలోనే పూర్తిచేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బెత్ మూనీ (76), కెప్టెన్ అలిస్సా హీలి (50) అర్ధ శతకాలతో రాణించారు.