చెన్నై: టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమి తర్వాత సెమీఫైనల్ బెర్తు అవకాశాలను కఠినంగా మారడంతో మిగిలిన రెండు మ్యాచ్‌లు టీమ్ఇండియాకు కీలకంగా మారాయి. జింబాబ్వేతో పోరు కోసం మంగళవారం భారత క్రికెటర్లు నెట్స్‌లో చెమటోడ్చారు.
సఫారీలతో పోరులో తుది జట్టు కూర్పుపై తీవ్ర విమర్శలు రావడంతో మేనేజ్మెంట్ దిద్దుబాటు చర్యలకు దిగింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్‌పటేల్ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తున్నది. నెట్ సెషన్లో చాలాసేపు బౌలింగ్ చేయడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
మరోవైపు కుటుంబ కారణాల రీత్యా రింకూసింగ్ ఉన్నఫళంగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. తన తండ్రి కాన్చంద్సింగ్ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో దవాఖానలో చేర్పించినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జింబాబ్వే పోరుకు రింకూ అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. రింకూ స్థానంలో శాంసన్‌ను తీసుకుంటారా లేక కుల్దీప్యాదవ్కు బెర్తు దక్కుతుందా అన్నది తేలాల్సి ఉంది.