హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): జనాభా లెకల్లో ఓబీసీల సమగ్ర గణనకు ప్రత్యేక క్యాటగిరీని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2027 జనగణనలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. బీసీల వాస్తవ జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో ఉంటేనే రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమం, సమాన ప్రాతినిధ్యం వంటి విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశముంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక క్యాటగిరీలు ఉన్నట్టుగానే జనాభా లెకల ప్రశ్నావళిలో ఓబీసీలకు స్పష్టమైన ప్రత్యేక క్యాటగిరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.