డెహ్రాడూన్: ఒకప్పుడు ‘నిఠారీ రాక్షసుడు’గా ముద్రపడి, సంచలనం సృష్టించిన 2006 నాటి హత్యల కేసులో నిర్దోషిగా విడుదలైన సురీందర్ కోలి (Surinder Koli) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఒక టీస్టాల్ లోపల ఉరికి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో అతడి మృతదేహం కనిపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడున్న ఆధార్ కార్డ్ ఆధారంగా మృతుడిని సురీందర్ కోలిగా గుర్తించారు. గత ఏడాది సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత, గత కొంతకాలంగా హరిద్వార్‌లో టీ అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. అతడి మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, 2006 డిసెంబర్లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 31లోని డీ 5 బంగ్లా పక్కన ఉన్న కాలువ వెనుక ప్లాస్టిక్ సంచులలో కుక్కిన 16 మానవ పుర్రెలు, ఎముకలు, దుస్తులను పోలీసులు కనుగొన్నారు. సమీపంలోని నిఠారీ గ్రామానికి చెందిన పేదలు, కూలీల కుటుంబాలకు చెందిన పిల్లలు అదృశ్యమవుతున్నట్లు స్థానికులు చాలా కాలంగా ఫిర్యాదులు చేశారు. అయితే వారి ఆందోళనలను పోలీసులు తొలుత పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు పాయల్ అనే యువతి అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమె మొబైల్ ఫోన్‌ను స్థానికుడైన రిక్షా వ్యక్తి వద్ద గుర్తించారు. డి-5లో నివసించే వ్యక్తి ఆ మొబైల్ ఫోన్ తనకు ఇచ్చినట్లు అతడు చెప్పాడు. ఆ ఇల్లు వ్యాపారవేత్త మొనిందర్ సింగ్ పాంధర్కు చెందగా, సురీందర్ కోలి అక్కడ పనివాడిగా ఉన్నాడు. పోలీసులు ఆ ఇంట్లో సోదాలు చేయగా 19 మంది పిల్లల హత్యలు, నరమాంస భక్షణకు సంబంధించిన ఆధారాలు లభించాయి. నిఠారీలో నివసించే పేద పిల్లలను ప్రలోభపెట్టి, వారిని చంపి, మృతదేహాలను ముక్కలు చేసి, వండుకొని తిన్నారన్న పుకార్లు వ్యాపించాయి.
కాగా, మొనిందర్ సింగ్ పాంధర్, సురీందర్ కోలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేసిన ఆరోపణలతో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 2007-2010 మధ్య సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. సురీందర్ కోలికి పలు కేసుల్లో కోర్టు మరణశిక్ష విధించగా, పాంధేర్కు ఇతర కేసుల్లో మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి.

Surinder Koli And Moninder
అయితే 2007లో సురీందర్ కోలికి మరణశిక్ష అమలు జరిగే పరిస్థితి దాదాపు ఖరారైంది. కానీ చివరి నిమిషంలో దాఖలైన పిటిషన్‌పై అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. అతడి మరణశిక్ష అమలును నిలిపివేశారు. దీంతో కోలికి ప్రాణాలతో బయటపడే అవకాశం లభించింది.
మరోవైపు ఈ కేసులు ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లకు వెళ్లగా ఆరోపణల్లో లోపాలు, దర్యాప్తులో లొసుగులు బయటపడ్డాయి. విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ 2023 అక్టోబర్‌లో నిందితులైన కోలి, పాంధేర్‌ను నిర్దోషులుగా హైకోర్టు విడుదల చేసింది.
కాగా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, బాధితుల కుటుంబాలతో కలిసి సీబీఐ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 2025లో సుప్రీంకోర్టు కూడా అన్ని ఆరోపణల నుంచి సురీందర్ కోలిని నిర్దోషిగా విడుదల చేసింది. నేరాల దారుణ స్వభావాన్ని అంగీకరిస్తూనే, ‘ఎంత తీవ్రమైన అనుమానం అయినా, సహేతుకమైన సందేహానికి అతీతమైన రుజువుకు ప్రత్యామ్నాయం కాలేదు’ అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.