హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : నవంబర్‌కు సంబంధించిన శ్రీవారి దర్శనం, వసతి కోటా షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను ఆగస్టు18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, ఈ-టికెట్లు పొందినవారు 20 నుంచి 22న మధ్యాహ్నం 12 గంటల్లోపు డబ్బు చెల్లించాలని పేర్కొన్నది. దర్శనం, వసతి, టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించి 21 న మధ్యాహ్నం 3గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్లను 24న ఉదయం10గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10గంటలకు, గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. https:// ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.