హుబ్లీ: రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్.. కర్ణాటకతో హుబ్లీలో మొదలైన టైటిల్ పోరులో తొలిరోజే శుభారంభం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు.. శుభమ్ పందిర్ (221 బంతుల్లో 117 నాటౌట్, 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యావర్ హసన్ (88), అబ్దుల్ సమద్ (67 బంతుల్లో 52 నాటౌట్, 5 ఫోర్లు, 1సిక్స్) రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 284 రన్స్ చేసింది. 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టును హసన్, శుభమ్ ఆదుకున్నారు.
ఈ ద్వయం రెండో వికెట్‌కు 139 రన్స్ జోడించింది. శతకం దిశగా సాగుతున్న హసన్‌ను ప్రసిద్ధ్ ఔట్ చేయగా కెప్టెన్ పరాస్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సమద్‌తో కలిసి మూడో వికెట్‌కు శుభమ్ 105 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆ జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు.