KTR | కేంద్ర పాలకులకు దేశం గురించి పట్టింపు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పాకిస్థాన్ కంటే గొప్పగా ఉన్నామని మనల్ని మత్తులో పెడుతున్నారని చెప్పారు. నిజానికి మనం ఎవరితో పోల్చుకోవాలని ప్రశ్నించారు. మతం మత్తులో పడి మనం ఎక్కడికో కొట్టుకుపోతున్నామని అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 80 ఏళ్ల కాలాన్ని చూసుకుంటే కొంత సంతోషం, కొంత బాధ కలుగుతుందని అన్నారు. ఇన్ని వైరుధ్యాల నడుమ కలిసి మెలసి ఉండటం మన గొప్పతనం అని తెలిపారు. స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. కానీ 80 ఏళ్ల తర్వాత కూడా జరగాల్సిన అభివృద్ధి జరగలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ మన దేశంలో నీళ్లు, రోడ్లు, కరెంటు లేని ఊళ్లు ఉన్నాయని చెప్పారు. పిల్లలకు నాణ్యమైన చదువు దొరకని పరిస్థితి ఉందన్నారు. దేశం ముందుకు పోవాలనే పోరాట వీరులు త్యాగాలు చేశారని తెలిపారు.
స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరులను పాలకులు అవమానిస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేంద్ర పాలకులు గాంధీజీని అవమానించాలని చూస్తున్నారని తెలిపారు. గాంధీని చంపిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. నెహ్రూను కూడా ఈ రోజుకీ అవమానిస్తూనే ఉన్నారని అన్నారు.
భారతదేశంలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఇంటింటికీ తాగు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేంత వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశమంతటికీ సాగు, తాగు నీరు ఇవ్వాలంటే 40 వేల టీఎంసీలు చాలు అని అన్నారు. ఇంకో 30 వేల టీఎంసీల నీళ్లు మన దేశానికి అదనంగా ఉన్నాయని చెప్పారు. 24 గంటల కరెంటు ఇచ్చే సామర్థ్యం మన దేశానికి ఉందన్నారు. కానీ పాలకులు రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని అన్నారు.
భారత దేశానికి జనాభానే పెద్ద మైనస్ అని చాలామంది చెబుతుంటారని కేటీఆర్ గుర్తుచేశారు. పొరుగున ఉన్న చైనా మనకన్నా పెద్ద దేశమని తెలిపారు. 45 ఏళ్ల కింద చైనా మనకంటే పేద దేశమని.. కానీ ఇవాళ ఎక్కడికి ఎగబాకిందని అడిగారు. నేడు అమెరికాతో పోటీపడే స్థాయికి చైనా చేరుకుందని చెప్పారు. చైనా ఎకానమీ 20 ట్రిలియన్లపైన ఉంది.. కానీ మన ఎకానమీ 3 ట్రిలియన్ల దగ్గరే ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మన దేశ దుస్థితి ఉందన్నారు.
మన పిల్లలు దేశం వదిలి విదేశాలకు ఎందుకు పోవాలని కేటీఆర్ ప్రశ్నించారు. మన దగ్గర ఎందుకు గొప్ప విద్యాసంస్థలు రాలేదని నిలదీశారు. ఇక్కడ అవకాశాల్లేకనే మన పిల్లలు విదేశాలకు పోతున్నారని చెప్పారు. అన్నీ ఉన్నా మన దేశంలో ఏం లోపించిందని ప్రశ్నించారు. మతం, ఆహారం, దుస్తులు, ఎవరి దేవుడు గొప్ప? ఇంకా ఇదేనా? అని నిలదీశారు. 80 ఏండ్ల తర్వాత కూడా కుల మతాల పేరిట పంచాయతీలేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.