Ranji Trophy | ఢిల్లీ : దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ తాజా సీజన్ (2024-25) ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని సంతరించుకుంది. బీసీసీఐ ఆదేశాల పుణ్యమా అని జాతీయ జట్టుకు ఆడే స్టార్ క్రికెటర్లు తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో రంజీ మ్యాచ్‌లను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆకర్షితులవుతున్నారు. దాదాపు పుష్కర కాలం తర్వాత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. తన రాష్ట్ర జట్టు (ఢిల్లీ)కు ఆడనుండటం అభిమానుల ఆకర్షణను అమాంతం పెంచగా కర్నాటక బ్యాటర్ కేఎల్ రాహుల్, హైదరాబాదీ పేసర్ సిరాజ్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. అదీగాక ఈ సీజన్లో ఇవే ఆఖరి లీగ్ దశ మ్యాచ్‌లూ కావడం మరో విశేషం. నాలుగు గ్రూపుల నుంచి క్వార్టర్స్ చేరే టాప్-2 జట్లు ఏవై ఉంటాయి? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
గ్రూపుల వారీగా చూస్తే గ్రూప్-ఏలో జమ్ముకశ్మీర్.. 29 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న ముంబై.. మూడో స్థానం (22 పాయింట్లు)లో ఉన్న తరుణంలో రహానే సేన క్వార్టర్స్ చేరుతుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. బరోడాతో జరుగబోయే మ్యాచ్‌ను జమ్ముకశ్మీర్ డ్రా చేసుకున్నా ఆ జట్టు ముందంజ వేస్తుంది. కానీ రెండో స్థానంలో బరోడా (27 పాయింట్లు).. మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా, మ్యాచ్ గెలిచినా ముంబై కథ ముగిసినట్టే! గత మ్యాచ్‌లో జమ్ముకశ్మీర్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కున్న ముంబై.. మేఘాలయాతో భారీ తేడాతో గెలిచి బోనస్ పాయింట్ సాధించడంతో పాటు బరోడా ఓడిపోతేనే డిఫెండింగ్ చాంపియన్‌కు క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశముంటుంది.
గ్రూప్-సీలో హర్యానా (26) అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానం కోసం కేరళ (21), కర్నాటక (19) పోటీలో ఉన్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో కర్నాటక.. హర్యానాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ సేన గెలిచినా.. బీహార్‌తో ఆడబోయే మ్యాచ్‌లో కేరళ విజయం సాధిస్తే కర్నాటకకు క్వార్టర్స్ కష్టమే అవుతుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై భారీ విజయం, కేఎల్ రాహుల్ రాకతో ఆ జట్టు కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.
గ్రూప్-బీలో విదర్భ.. 34 పాయింట్లతో క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకోగా గుజరాత్ (25), హిమాచల్‌ప్రదేశ్ (21) మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. గురువారం నుంచి ఈ రెండు జట్ల మధ్యే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత.. తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న హైదరాబాద్.. 16 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఆ జట్టు విదర్భతో నాగ్‌పూర్‌లో చివరి మ్యాచ్ ఆడనుంది.
గత మ్యాచ్‌లో చండీగఢ్‌ను ఓడించి 25 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న తమిళనాడు.. తమ తర్వాతి మ్యాచ్‌లో జార్ఖండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా ఆ జట్టు క్వార్టర్స్ చేరుతుంది. కానీ ఓడితే మాత్రం.. చండీగఢ్ (19), సౌరాష్ట్ర (18) జట్లు తమిళనాడుకు పోటీనివ్వొచ్చు. మరోవైపు చండీగడ్ ఛత్తీస్‌గఢ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సి ఉంది. సౌరాష్ట్ర సైతం అసోంపై భారీ విజయం సాధిస్తే ఈ గ్రూప్‌లో రేసు మరింత రసవత్తరమవుతుంది. గత మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా.. అసోంతో మ్యాచ్‌లోనూ మెరవాలని ఆ జట్టు ఆశిస్తోంది.
గ్రూప్-ఏలో క్వార్టర్స్ బెర్తు కోసం రసవత్తర పోరు జరుగుతున్నా అందరి కండ్లూ రేసులో లేని ఢిల్లీ, రైల్వేస్ మ్యాచ్ వైపే ఉన్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. పుష్కర కాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేస్తున్న కోహ్లీ ఆటను చూసేందుకు స్టేడియానికి అభిమానులు పోటెత్తే అవకాశముంది. ముందు ఈ మ్యాచ్‌కు ప్రత్యక్ష ప్రసారాలు లేవని చెప్పిన బీసీసీఐ.. కోహ్లీ అభిమానుల ఒత్తిడితో జియో సినిమాలో లైవ్‌ను అందించేందుకు సిద్ధమైంది. కొంతకాలంగా కోహ్లీ ఆటతీరుపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంతో పాటు తోడు చాంపియన్స్ ట్రోఫీకి ముందు తన ఆటలోని బలహీనతలను సరిదిద్దుకునేందుకు కోహ్లీకి ఇది చక్కటి అవకాశం. మరి విరాట్ ఏం చేసేనో!