దేవరుప్పుల, మార్చి 9 : ‘ చేతికొచ్చే దశలో పంటలు ఎండుతున్నయి.. నీళ్లు ఇయ్యాలనే సోయి ప్రభుత్వానికి లేదు.. సీఎం రేవంత్‌రెడ్డికి కచ్చితంగా రైతుల ఉసురు తాకుతుంది& అన్నంపెట్టే అన్నదాతలను ఏడిపిస్తే వారి శాపం తగిలిపోతడు.. వెంటనే నీళ్లు వదిలి పంటలను కాపాడుతారా.. లేదా ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తారా’.. తేల్చుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని మాల్యాతండా, లకావత్ తండా, దుబ్బతండాల్లో సాగునీరు అందక ఎండుతున్న వరి, మక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. పొట్ట దశలో వరి పంట ఎండుతున్నదని పలువురు గిరిజన రైతులు ఎర్రబెల్లి ముందు కన్నీరు పెట్టుకోగా ఆయన చలించిపోయారు.
నెర్రెలువారిన వరి పొలాలను చూసి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లుండీ ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. దేవాదుల నీటిని ప్రణాళికా బద్ధంగా వదిలితే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల దేవాదుల కాల్వలు పారడం లేదన్నారు. రెండు రోజుల్లో నీళ్లు వదలకపోతే, మరో పది రోజుల్లో వేలాది ఎకరాల్లో పంట చేతికి రాకుండా పోతుందన్నారు.
రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదని, కనికరం లేని కాఠిన్య పాలన అని, ఇంతకు ఇంత అనుభవిస్తారని అన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఆగమవుతున్నాయని, ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికే మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టిందన్నారు. యూరియా కోసం రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారని ఆవేదన చెందారు. చెన్నూరు కాల్వకు నీరు రాక ఏడాదవుతున్నదన్నారు. రైతుల బాధలు చూస్తుంటే కండ్లవెంట నీళ్లు వస్తున్నాయన్నారు. నదుల్లో నీరుండీ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు.
ఉత్తమన్నా.. సాగునీరు వదిలి రైతులను కాపాడండి..
‘ఉత్తమన్నా.. సాగునీరు వదిలి యాసంగి పంటలను కాపాడండి’ అని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డిని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫోన్లో వేడుకున్నారు. దేవాదుల నీరు వదిలి పాలకుర్తి నియోజకవర్గ రైతులను కాపాడాలని కోరారు. ఎస్సారెస్పీ నీరు వర్ధన్నపేట, రాయపర్తి మండలాలకు రావడం లేదని, మరోవైపు దేవాదుల నీరు పాలకుర్తి, చెన్నూరు రిజార్వాయర్ల కాల్వల ద్వారా రాకపోవడంతో యాసంగి పంటలు ఎండుతున్నాయని ఉత్తమ్‌కు వివరించారు.
రెండురోజుల్లో నీరు వదిలితే వేలాది ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని, ఆలస్యమైతే పంటలు చేతికి రావని అన్నారు. గతేడాది తాను ఫోన్ చేయగానే మీరు స్పందించడం వల్ల సాగునీరు అందిందని, ఈ సారి తనమాటగా సానుకూలంగా స్పందించాలని కోరారు. అంతటితో ఆగక నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, ఎస్ఈ, డీఈలకు ఫోన్ చేసి చెన్నూరు రిజర్వాయర్‌కు పోయే ఎల్-4 కాల్వకు నీరు వదిలి ఎండుతున్న పంటలను కాపాడాలని కోరారు.
రూ.రెండు లక్షల అప్పుచేసినం..
యాసంగి దినం రెండెకరాలు నాటు పెట్టినం. కొసకు దేవాదుల నీళ్లొదులుతరులేరు. పారదనే నమ్మకం ఉండే. బోరు ఎండిపోతే రూ.లక్షన్నర పెట్టి రెండు బోర్లు ఏసినం. చెమట చుక్క రాలే. పొట్టకున్న వరి చేను ఎండుతుం ది. దేవాదుల నీరు జాడలేదు. వదులుతరన్న నమ్మకం పోయింది. ఈ కారు కు రూ.రెండు లక్షల అప్పు అయింది. ఎట్ల తీర్చాలే. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ల కరువు లేకుండే. ఇది మాయదారి ప్రభుత్వం. కనీసం కనికరం లేదు. పొలం ఎండుతుంటే నిద్ర పడుతలేదు. అప్పుల బాధకు ఉరేసుకొని సద్దామనిపిస్తుంది. వ్యవసాయం అంతా ఆగమాగం ఉంది. రైతు భరోసా లేదు. యూరియా దొరుకుతలేదు. మా ఎమ్మెల్యేను చూద్దామంటే కనబడదు. రేవంత్‌రెడ్డి మాయమాటలు విని ఓట్లు గుద్దినం. అంత కిందిమీదైంది. ఇప్పటికైనా నీళ్లు అందితే సగం పంటైనా చేతికొస్తది. మా గోస దయాకర్సారు చూసి చిలించిపోయకిండు.
– అజ్మీరా యాదలక్ష్మి, మహిళా రైతు, మాల్యాతండా
పాలిచ్చే బర్రెను అమ్మి.. దున్నపోతును కొన్నట్టయింది..
పాలిచ్చే బర్రెనమ్మి.. దున్నపోతును కొనుక్కున్నట్టుంది. సక్కని తండ్రి కేసీఆర్‌ను ఓడగొట్టి మాయదారి రేవంతును గెలిపిస్తే నూరు చెరువుల నీళ్లు తాగిస్తుండు. నాలుగెకరాలు నాటుపెడితే ఇప్పటికే రెండకెరాల్లో ఎడ్ల మేపుతున్నం. ఉన్న రెండకరాలు ఎండెతట్టున్నది. బోర్లు పోస్తలేవు, కరెంటు ఉంటలేదు. నీళ్లు వదులుత లేరు. వ్యవసాయం చేయాలంటే తిప్పలైతాంది. కేసీఆర్ ఉన్నప్పుడు పుష్కలమైన నీళ్లు, పొలాలు జాలు పట్టిపోయేది. ఇదేం కర్మ. మేం బతికేదే వరి మీద. అదీ ఎండుతుంటే ఎట్ల బతకాలి. మా పసులెట్లా బతుకాలె. పుట్టెడు పెట్టుబడి పెట్టినం. నగల దుకాణంల బంగారం కుదువబెట్టి అప్పుతెచ్చినం. అవెట్ల తీర్పాలె.
– అజ్మీరా రాంధన్ , రైతు, మాల్యాతండా