Virat Kohli | విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ ఐకాన్! దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ.. ఆదాయ ఆర్జనలోనూ అందరికంటే టాప్ గేర్‌లో దూసుకెళుతున్నాడు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే చందంగా కోహ్లీ కండ్లు చెదిరే రీతిలో కార్పొరేట్ కంపెనీలతో కండ్లు చెదిరే రీతిలో ఒప్పందాలు చేసుకుంటున్నాడు.
సచిన్, ధోనీ, గంగూలీ లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని ఫీట్‌ను కోహ్లీ అనతికాలంలోనే అందుకున్నాడు. తన బ్యాట్‌పై ఎమ్ఆర్ఎఫ్ కంపెనీ లోగో వేసుకున్నందుకు కోహ్లీకి అందుతున్న మొత్తం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. 2017లో తొలిసారి ఎమ్ఆర్ఎఫ్తో విరాట్ 100 కోట్ల డీల్ చేసుకున్నాడు. ఇది ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యధిక మొత్తం కావడం విశేషం. అయితే ఈ ఒప్పందాన్ని భవిష్యత్‌లోనూ కోహ్లీ కొనసాగించే అవకాశం కనిపిస్తున్నది.
ఎమ్ఆర్ఎఫ్తో ఒప్పందంలో భాగంగా కోహ్లీకి ఏడాదికి రూ.12.50 కోట్లు అందుతున్నాయి. అంటే నెలకు కోటి రూపాయల చొప్పున ఈ స్టార్ బ్యాటర్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే గతంలో స్పార్టన్ స్పోర్ట్స్, అమిటీ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న మహేంద్రసింగ్ ధోనీ 25 కోట్లు ఆర్జించాడు. సచిన్(8 కోట్లు), రోహిత్‌శర్మ(3 కోట్లు), యువరాజ్‌సింగ్(4.5 కోట్లు) బ్యాట్ స్పాన్సర్షిప్ కింద కోట్ల రూపాయలను దక్కించుకున్నారు. సమీప భవిష్యత్‌లో కోహ్లీ 100 కోట్ల డీల్‌ను బద్దలు కొడుతారేమో చూడాలి.