Virat Kohli : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అభిమానులకు తీపి కబురు చెప్పాడు. తన వీడ్కోలు గురించి ప్రచారమవుతున్న వదంతులను తోసిపుచ్చాడు. టీ20లకు రిటైర్మెంట్ పలికిన తాను వన్డేలకు అందుబాటులో ఉంటానని, వచ్చే వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆడతానని చెప్పాడు విరాట్. ఐపీఎల్ 18వ సీజన్లో చెలరేగి ఆడుతున్న కోహ్లీ తాజాగా ఒక ఈవెంట్‌కు హాజరయ్యాడు. అక్కడ నిర్వాహకులు, అభిమానులు అతడిని ‘మీ సుదీర్ఘ కెరియర్లో తర్వాతి పెద్ద అడుగు ఏంటీ?’ అని అడిగారు.
అందుకు.. తర్వాతి బిగ్ స్టెప్ అంటే.. ప్రస్తుతానికి కచ్చితంగా ఫలానా అని చెప్పలేను. కానీ, వచ్చే వరల్డ్ కప్ గెలవాలని ఉంది. అదే బహుశా నా కెరియర్లో మరో పెద్ద అడుగు అని బదులిచ్చాడు కోహ్లీ. అతడి సమాధానం విన్న అక్కడివారంతా చప్పట్లు కొడుతూ భారత స్టార్ ప్లేయర్‌కు మద్దతు తెలిపారు.
Question: Seeing In The Present, Any Hints About The Next Big Step?
Virat Kohli Said: The Next Big Step? I Don’t Know. Maybe Try To Win The Next World Cup 2027.🏆🤞 pic.twitter.com/aq6V9Xb7uU
— virat_kohli_18_club (@KohliSensation) April 1, 2025
వెస్టిండీస్ గడ్డపై నిరుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సఫారీలను ఓడించి ట్రోఫీ గెలుపొందిన తర్వాత భావోద్వేగానికి గురైన అతడు.. పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. అతడిని అనుసరిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20లకు వీడ్కోలు పలికారు. అప్పటి నుంచి వన్డేలు, టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారీ సీనియర్ త్రయం.
అయితే.. ఈ మధ్యే ఈ ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులు తథ్యమనే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఏ ప్లస్ విభాగంలో ఉన్న విరాట్, రోహిత్, జడ్డూలను ఏ కేటగిరీ ఆటగాళ్లుగా పరిగణించాలని బీసీసీఐ భావిస్తుందనే కథనాలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో తాను దక్షిణాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని భావిస్తున్నట్టు విరాట్ చెప్పడంతో రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్టే అని అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం 36 ఏళ్లున్న కోహ్లీ.. ఫిట్నెస్ రీత్యా, ఫామ్ రీత్యా.. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా అర్హుడే. ఇప్పటికే 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, ఈమధ్యే ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందిన జట్టులో సభ్యుడైన విరాట్ మరొక వరల్డ్ కప్ ఆడి.. ట్రోఫీని ముద్దాడితే చూసి తరించాలని ప్రతి ఒక్కరి కోరిక.