హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగబోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao ) ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన అగ్రి షో ( Agri Show ) కార్యకమ్రానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
అమెరికా( America ) తో చేసుకున్న ఒప్పందం వల్ల ఆ దేశంలో పండిన సోయా( Soya) , మక్కలు ( Maize ) , పత్తి ( Cotton ) లాంటివి ఎలాంటి టాక్స్ లేకుండా ఇండియాకు దిగుమతి అవుతాయని వెల్లడించారు. రూ. 45 లక్షల కోట్ల విలువైన మక్కజొన్న, పత్తి, సోయా అమెరికా మనకు పంపిస్తే మన దేశ రైతులు ఏం కావాలని ప్రశ్నించారు.
సోయా పంటను ఎక్కువగా పండించే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ రైతుల పరిస్థితి ఏం కావాలని అన్నారు. ఈసారి మన ప్రాంతాల్లో మక్కలు ఎక్కువ పండిస్తున్నారు. ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే ప్రమాదముందని వెల్లడించారు. విదేశాల నుండి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ పైన 25 శాతం టాక్స్ ఉండేదని. నేడు 16 శాతానికి తగ్గించడం వల్ల ఇక్కడ రూ. 25వేలు ఉన్న పామ్ ఆయిల్ టన్ను రేట్ రూ. 21వేలకు పడిపోయిందని పేర్కొన్నారు. సుంకాలు తగ్గించడం వల్ల భారత రైతులకు ఏం లాభం జరుగుతుందో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.