Allu Arjun | హిందూ సాంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి 19, 2026 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ- రష్మికల పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు అల్లు శిరీష్ కూడా తన ప్రేయసి నయానికా రెడ్డితో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 6న కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి వేడుకల సందడి ప్రారంభమైంది. దుబాయ్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ప్రత్యేక గ్రాండ్ పార్టీ నిర్వహించిన శిరీష్, ఆ వేడుకల ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించారు.
ఇక తమ్ముడి పెళ్లి వేడుకల సందర్భంగా అల్లు అర్జున్ హైదరాబాద్‌లో ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ప్రత్యేక ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. జనవరి 31న కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఉపాసన హాజరైన మొదటి పబ్లిక్ పార్టీ ఇదే కావడం విశేషం. మరోవైపు రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ ఈ వేడుకకు హాజరయ్యారు.
అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి, అల్లు శిరీష్ తన కాబోయే భార్య నయానికా రెడ్డి, రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి దిగిన గ్రూప్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్లాక్ డ్రెస్ కోడ్‌లో కనిపించిన ఈ జంటల ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పార్టీకి వచ్చిన ఇతర అతిధుల విషయానికి వస్తే.. దగ్గుపాటి రానా సతీమణి మిహికా బజాజ్, యంగ్ బ్యూటీ శ్రీ లీల, ఫరియా అబ్దుల్లా, సిద్దు జొన్నలగడ్డ, అక్కినేని సుశాంత్, సందీప్ కిషన్, తేజ సజ్జ, కృతి శెట్టి, నిధి అగర్వాల్, రాశిఖన్నా తదితరులు ఈవెంట్ లో సందడి చేశారు. దాదాపు అందరు సెలబ్స్ కూడా బ్లాక్ డ్రెస్ కోడ్ పాటించడం విశేషం. మొత్తానికైతే బన్నీ ఇచ్చిన ఈ గ్రాండ్ ప్రైవేట్ పార్టీలో సందడి చేసిన సెలబ్రిటీల పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.