Road accident : బస్సు వేగంగా దూసుకొచ్చి వ్యాన్‌ను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం భింద్ జిల్లా (Bhind district) లో జాతీయ రహదారి 719పై ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గొహాద్ చౌరాహ (Gohad Chauraha) పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిమ్కా గ్రామం (Chhimka village) సమీపంలో ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ గ్వాలియర్ నుంచి భింద్‌కు వెళ్తుండగా.. బస్సు భింద్‌లో పెళ్లి బృందాన్ని దించి గ్వాలియర్‌కు ఖాళీగా తిరిగి వస్తోంది. బస్సు ఢీకొట్టగానే వ్యాన్‌లోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురు క్షతగాత్రులను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించడంతో మృతుల సంఖ్య ఐదుగురు పెరిగింది. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను గ్వాలియర్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.