T20 World Cup 2024 : ఐసీసీ టోర్నీల్లో పసికూనలు పెద్ద జట్లకు షాకివ్వడం తరచూ జరిగేదే. ఒకప్పుడు బంగ్లాదేశ్, కెన్యా, ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు సంచలనాలకు కేరాఫ్ అయితే.. ఇప్పుడు యూఎస్ఏ(USA) జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. తొలి పోరులోనే 196 పరుగుల టార్గెట్‌ను ఊదేసిన అమెరికా మాజీ చాంపియన్ పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. దాంతో, పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే గుర్తుండిపోయే రికార్డు నెలకొల్పింది. పాక్‌పై అమెరికా విజయానికి ఐసీసీ అరుదైన క్లబ్లో చోటు దక్కింది.
మెగా టోర్నీలో పెద్ద టీమ్‌లకు షాకిచ్చిన ఐదో జట్టుగా ఆతిథ్య యూఎస్ఏ రికార్డు పుటల్లోకి ఎక్కింది. పొట్టి ఫార్మాట్ అంటేనే రికార్డు విజయాలకు, సంచలనాలకు నెలవు. అందుకు తగ్గట్టే ఈ మెగా టోర్నీ రెండో సీజన్లోనే నెదర్లాండ్స్(Netherlands) జట్టు సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్‌పై అద్భుత విజయం నమోదు చేసి ఔరా అనిపించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన పోరులో డచ్ జట్టు ఆఖరి బంతికి జయభేరి మోగించింది.
ఆ తర్వాత 2016 ఎడిషన్‌లో అఫ్గనిస్థాన్(Afghanistan) చిరస్మరణీయ విజయం సాధించింది. బలమైన వెస్టిండీస్‌ను 6 పరుగుల తేడాతో మట్టికరిపించింది. రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్‌లో నమీబియా(Namibia) రికార్డు విక్టరీ కొట్టింది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌పై డక్‌వర్త్ లూయిస్(DLS) పద్ధతి ప్రకారం 5 పరుగులతో గెలిచి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.