ముంబై: నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టడంపై మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ‘కొందరు ఓట్లు, కొందరు చెంప దెబ్బలు’ ఇస్తారని వ్యాఖ్యానించారు. (Sanjay Raut on Kangana) హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనాను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టింది. సంజయ్ రౌత్ దీనిపై శుక్రవారం స్పందించారు. ‘కొందరు ఓట్లు ఇస్తారు, మరికొందరు చెంప దెబ్బలు ఇస్తారు. అసలేం జరిగిందో నాకు తెలియదు. తన అమ్మ కూడా కూర్చున్నదని లేడీ కానిస్టేబుల్ చెప్పిందంటే నిజమే. రైతు ఆందోళనలో ఆమె తల్లి ఉండి, ఎవరైనా వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినట్లయితే, అది కోపాన్ని కలిగిస్తుంది’ అని మీడియాతో అన్నారు.
కాగా, కంగనాపై దాడిని సంజయ్ రౌత్ ఖండించారు. ప్రధాని మోదీ చట్టబద్ధమైన పాలన ఉండాలని చెబితే దానిని చేతుల్లోకి తీసుకోకూడదని తెలిపారు. ‘రైతుల ఆందోళనలో పాల్గొన్న ప్రజలు భారతదేశ కుమారులు, కుమార్తెలు. ఎవరైనా భారత మాతను అవమానిస్తే, ఎవరైనా బాధపడితే, అది ఆలోచించాల్సిన విషయమే. కంగనా పట్ల నాకు సానుభూతి ఉంది. ఆమె ఇప్పుడు ఎంపీ. ఎంపీపై దాడి చేయకూడదు. రైతులను కూడా గౌరవించాలి’ అని అన్నారు.