WTC 2024-25 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. స్వదేశంలో వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయంతో మూడోసారి టెస్టు గద (Test Mace) పోరులో అందరికంటే ముందున్న భారత జట్టు అవకాశాలపై న్యూజిలాండ్ గట్టి దెబ్బ కొట్టింది. వరుసగా రెండు విజయాలతో 12 ఏండ్ల రికార్డును బద్ధలు కొడుతూ టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. ముంబై టెస్టులోనూ కివీస్ గెలిచిందంటే.. టీమిండియా హ్యాట్రిక్ ఫైనల్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC 2024-25) ఫైనల్ ఆడడం అసాధ్యమైతే కాదు. కాకపోతే ఇకపై ఆడబోయే ఆరు టెస్టుల్లో కనీసం ఐదు గెలవాలి. లేదంటే నాలుగు విజయాలు, ఒక డ్రా అయినా సరే. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ చిత్తుగా ఓడితే మాత్రం టెస్టు గదపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అప్పుడు శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు పోటీలో ఉంటాయి. అదెలాగంటే..?
ఈ ఏడాది స్వదేశంలో వరుసగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను మట్టికరిపించిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. వన్డే వరల్డ్ కప్ అనంతరం వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో సిరీస్ సమంతో అగ్రస్థానం కాపాడుకుంది. ఈమధ్యే బంగ్లాదేశ్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన ఫైనల్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. ఇక మిగిలిన 8 మ్యాచుల్లో ఐదు గెలిచినా ఫైనల్ ఆడడం పక్కా అని అభిమానులు ధీమాతో ఉన్నారు.
It’s crunch time in #WTC25 🔥
Five teams, two spots – a place in the finale hangs in the balance. Who are your picks? 🤔
➡ https://t.co/YdVQ70XtAl pic.twitter.com/glTjYQ4Eru
— ICC (@ICC) October 28, 2024
కానీ, భారత్‌కు ఊహించిన షాకిస్తూ న్యూజిలాండ్ రెండు టెస్టుల్లో జయభేరి మోగించింది. అంతే.. సమీకరణాలు మారిపోయాయి. అప్పటిదాకా రేసులో లేని కివీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలో ఫైనల్ ఆడేందుకు మరింత చేరువయ్యాయి. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా.. లంక, న్యూజిలాండ్‌లు మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. మిర్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన సఫారీ జట్టు టాప్ -5లోకి దూసుకొచ్చింది.
డబ్ల్యూటీసీ 2024-25 సీజన్ ముగిసే సమయానికి టీమిండియా ఆరు టెస్టులు ఆడనుంది. అందులో 5 మ్యాచ్‌లు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతోనే ఉన్నాయి. మాజీ చాంపియన్ అయిన ఆస్ట్రేలియా మాత్రం ఏడు మ్యాచ్‌లు ఆడనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి ట్రోఫీ పట్టేసి.. ఆపై లంకను ఓడిస్తే కంగారూ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్ చేరుతుంది. మరోవైపు స్వదేశంలో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన శ్రీలంక.. ఆసీస్‌తో రెండు, దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఆడనుంది. ఈ నాలుగు మ్యాచుల్లో ధనంజయ డిసిల్వా సేన చెలరేగితే లంక ఫైనల్ రేసులో నిలుస్తుంది.
New Zealand take an unassailable 2-0 lead as India lose their first Test series at home since 2012.#WTC25 | #INDvNZ 📝: https://t.co/Kl7qRDguyN pic.twitter.com/ASXLeqArG7
— ICC (@ICC) October 26, 2024
న్యూజిలాండ్ విషయానికొస్తే.. భారత్‌తో ముంబైలో ఒక టెస్టు, అనంతరం ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఉన్నాయి. ఈ నాలుగింటా కివీస్ గెలిచి తీరాలి. అప్పుడు భారత జట్టు చేతిలో ఆస్ట్రేలియా ఓడినా లేదా లంకకు ఆసీస్, సఫారీలు షాకిచ్చినా న్యూజిలాండ్ అవకాశాలు మెరుగు పడుతాయి. ఇక దక్షిణాఫ్రికా ఈ సీజన్ చివర్లో ఐదు టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో ఒకటి, శ్రీలంకతో 2, పాకిస్థాన్‌తో 2 మ్యాచులు సఫారీ జట్టు ఫైనల్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.
ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండానే టీమిండియా ఫైనల్ చేరాలంటే.. ముంబైలో కివీస్‌ను చిత్తుగా ఓడించాలి. ఆపై నవంబర్‌లో ఆస్ట్రేలియాకు ముకుతాడు వేసి హ్యాట్రిక్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించాలి. అయితే.. సంచలనాలకు కేరాఫ్ అయిన క్రికెట్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అనేది అభిమానులను కలవర పెడుతోంది.