Maharashtra | మహారాష్ట్రలోని అధికార మహాయుతి ప్రభుత్వంపై ప్రతిపక్షాలపై పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. డీజీపీ రష్మీ శుక్లాను ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మహా వికాస్ అఘాడి (MVA) కూటమి అభ్యర్థులపై దాడులకు పాల్పడుతోందని.. ఎన్నికల్లో ఓటమి భయంతోనే పోలీసుతో ఒత్తిడి పెంచుతుందని మండిపడ్డారు. శివసేన యూబీటీ అభ్యర్థి అద్వయ్ హిరాయ్ పాటిల్‌పై శివసేన మంత్రి దాదాజీ బూసే గూండాలు నాసిక్‌లోని మాలెగావ్ ఔటర్ నియోజకవర్గంలో దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసులు దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఇది మాలేగావ్కి మాత్రమే పరిమితం కాదన్నారు. డీజీపీ రష్మీ శుక్లాను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడానికి కారణం అదేనన్నారు. ఇదిలా ఉండగా.. సీట్ల సర్దుబాటుపై ఆయన స్పందిస్తూ.. మిత్రపక్షాల భిన్నవాదనల మధ్య మిరాజ్, షోలాపూర్ సౌత్ స్థానాల్లో శివసేన (యూబీటీ) పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని పార్టీతో పాటు ఎంవీఏలో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) ఉన్నాయన్నారు. శివసేన పార్టీ నిలబెట్టిన స్థానాల్లోనూ సమాజ్‌వాదీ పార్టీ నామినేషన్లు దాఖలు చేసిందన్నారు. రాయ్‌గఢ్‌లో పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీకి రెండు మూడు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.