Rohan Bopanna : భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) మరో ఘతన సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన బోపన్న ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. దాంతో, ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆడనున్న నాలుగో భారతీయుడిగా బోపన్న రికార్డు సృష్టించనున్నాడు. డబుల్స్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న ఈ ఏడాది ఆఖర్లో ఏటీపీ ఫైనల్స్ బరిలోకి దిగనున్నాడు.
రోలెక్స్ పారిస్ మాస్టర్స్ టోర్నీ నుంచి నాథనీల్ లామ్మన్స్, జాక్సన్ విత్రోల జోడీ నిష్క్రమించడంతో బోపన్న ద్వయానికి అవకాశం వచ్చింది. నిరుడు ఏటీపీ ఫైనల్స్ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టిన బోపన్న – ఎబ్డెన్ జంట ఈసారి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.
నవంబర్ 10వ తేదీన ఇటలీ వేదికగా ఏటీపీ ఫైనల్స్ మొదలవ్వనుంది. ఎనిమిది రోజుల పాటు సాగే ఈ టోర్నీలో బోపన్న జోడీ ఎలైట్ గ్రూప్‌లో ఉంది. ఈ ఏడాది బోపన్న – ఎబ్డెన్‌లు ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిల్ కొల్లగొట్టారు. 43 ఏండ్ల 331 రోజుల వయసులో బోపన్న గ్రాండ్‌స్లామ్ వీరుడిగా రికార్డు సృష్టించాడు.
🇮🇳𝗕𝗼𝗽𝗮𝗻𝗻𝗮/🇦🇺𝗘𝗯𝗱𝗲𝗻 𝗾𝘂𝗮𝗹𝗶𝗳𝘆 𝗳𝗼𝗿 𝗔𝗧𝗣 𝗙𝗶𝗻𝗮𝗹𝘀 𝗳𝗼𝗿 𝘁𝗵𝗲 𝟮𝗻𝗱 𝘀𝘁𝗿𝗮𝗶𝗴𝗵𝘁 𝘆𝗲𝗮𝗿
➡️ The ATP Finals is the season-ending showdown between the top 8 singles players and top 8 doubles teams of the season
➡️ Our pair’s qualification comes at… pic.twitter.com/d6iEhNMs90
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) October 29, 2024
అంతేకాదు వరల్డ్ నంబర్ 1 ర్యాంకు కూడా ఈ జోడీ సొంతమైంది. ఆ తర్వాత బోపన్న – ఎబ్డెన్ జంట మియామి ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచింది. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో అదరగొట్టినా సెమీస్‌లోనే ఈ ద్వయం వెనుదిరిగింది. అప్పటి నుంచి ఒక్క ఏటీపీ టూర్లోనూ బోపన్న జంట టైటిల్ సాధించలేదు.
ఏటీపీ ఫైనల్స్‌లో బోపన్న ప్రయాణం 2011లో ప్రారంభమైంది. అప్పుడు ఐసమ్ ఉల్ హక్ ఖురేషీతో తొలిసారి ఈ టోర్నీలో ఆడాడు. ఇక.. 2012లో ముందు మహేశ్ భూపతి (Mahesh Bhupathi) జతగా ఆడిన బోపన్న రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. అనంతరం 2015లో ఫ్లోరిన్ మెర్గియాతో కలిసి ఆడినప్పటికీ మళ్లీ నిరాశే మిగిలింది.