నిజామాబాద్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల దామాషా ఖరారుకు సంబంధించిన అంశంపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్(BC Commission) మంగళవారం బహిరంగ విచారణ చేపట్టింది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. ఈ విచారణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ బీసీల అభ్యున్నతి, సంక్షేమంపై సమగ్ర నివేదికను బీసీ కమిషన్ కు అందించింది. రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయించాలని విన్నవించింది.
నిజామాబాద్ జిలాల్లో బీసీ భవన్ నిర్మించాలని, బీసీ స్టడీ సర్కిల్‌కు రెండెకరాల స్థలం కేటాయించి సొంత భవనం నిర్మాణం చేయాలని, కాలేజీ హాస్టళ్ల సీట్లను రెట్టింపు చేయాలని, మహాత్మ జ్యోతిబా ఫూలే, ఛత్రపతి శివాజీ జయంతులకు సెలవు దినం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. సమగ్ర కుల గణన అనంతరం కులాల జనాభా లెక్కలు బహిరంగ పర్చాలని కోరింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ నివేదికను, సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు అందించిన సలహాలు, సూచనలను బీసీ కమిషన్ పరిగణనలోకి తీసుకుంది.
సంఘం నివేదికపై ప్రశంశలు కురిపించింది. ప్రస్తుత సమయంలో అతి పెద్ద బీసీ సంఘంగా గుర్తించబడుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘంపై గురుతర బాధ్యత ఉందని గుర్తు చేసింది. బీసీ లెక్కలు తేలేలా సంఘం తరపున గ్రామ గ్రామాన చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్(G. Niranjan) సూచించారు. బీసీలందరూ కుల గణనలో పాల్గొనేలా చూడాలని, అప్పుడే సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, విద్య రంగాల్లో బీసీల వాటా పెరుగుతుందని చెప్పారు. కమిషన్‌కు వచ్చిన బీసీల లెక్కల ప్రకారమే తాము చర్యలు తీసుకోగలమనే విషయాన్ని బీసీలు గుర్తించాలన్నారు.