తిరుపతి : తిరుపతిలోని(Tirupati ) శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు(Pavitrostavalu) వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు.
స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం(Raksabandan), అన్నప్రానాయానం నిర్వహించారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం(Tirumanjanam) వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.