Tamim Iqbal : చెపాక్ టెస్టులో ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ప్రశంసల వర్షం కురుస్తోంది. మొదట బ్యాటుతో శతకం బాదేసి.. ఆపై బంతితో బంగ్లాను పడగొట్టిన అశ్విన్ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఒకే మ్యాచ్‌లో ఆరో సెంచరీతో పాటు 37వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో రికార్డులు సృష్టించాడు. చెపాక్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన అశూను బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) ఆకాశానికెత్తేశాడు. అంతేకాదు భారత జట్టులో అశ్విన్ కూడా స్టార్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చెన్నై టెస్టులో అశ్విన్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిన తమీమ్ ఇక్బాల్ మ్యాచ్ అనంతరం సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియాలో రోహిత్, కోహ్లీలతో పేర్లే వినిపిస్తాయని, అశ్విన్ కూడా వీళ్లకు సరిసమానుడే అని తమీమ్ అన్నాడు. ‘చెపాక్‌లో అశ్విన్ ఇన్నింగ్స్ ఓ అద్భుతం. అతడొక నిఖార్సైన బ్యాటర్‌గా ఆడాడు. నేను వేరే దేశం నుంచి వచ్చాను. అయితే.. నేను తరచూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లే ఎక్కువగా విన్నాను. కానీ, నా దృష్టిలో అశ్విన్ కూడా వాళ్లతో సమానమే.
తమీమ్ ఇక్బాల్, అశ్విన్
అయితే.. సెంచరీ కొట్టినప్పుడో, ఐదు వికెట్లు తీసినప్పుడో మాత్రమే మనం అశ్విన్ గురించి మాట్లాడుకుంటాం. టీమిండియా విజయాల్లో అతడి పాత్ర కూడా మరువలేనిది. చెప్పాలంటే.. రోహిత్, కోహ్లీలు జట్టుకు ఎంత ముఖ్యమో అశ్విన్ కూడా అంతే ముఖ్యం’ అని తమీమ్ తెలిపాడు. తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
అశ్విన్(113), జడేజా(86)
సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై టెస్టు మ్యాచ్. అయినా అశ్విన్ కంగారు పడలేదు. తనకు అచ్చొచ్చిన పిచ్ మీద బ్యాటుతో, బంతితో చెలరేగిపోయాడు. మొదట బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అశ్విన్ ఆరో టెస్టు సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజా(86)తో కలిసి ఏడో వికెట్‌కు 195 పరుగు భాగస్వామ్యంతో జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో పర్యాటక జట్టును ఓటమిని ఖరారు చేశాడు. ఈ క్రమంలోనే అశ్విన్ డబ్ల్యూటీసీ 2024-25 సీజన్లో అత్యధిక పర్యాయాలు ఐదు వికెట్లతో రికార్డు నెలకొల్పాడు. 11 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన అశూ.. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon)ను రెండో స్థానానికి తోసేశాడు.