హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : యాసంగి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయలేదు? రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ‘కేరళ ఎన్నికల పన్ను’ కారణమనే సమాధానం వినిపిస్తున్నది. కేరళ ఎన్నికలకు వెయ్యి కోట్లు సర్దుబాటు చేసేందుకే పెట్టుబడి సాయాన్ని వాడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రైతులకు రూ.9వేల కోట్లు ఇచ్చే బదులు.. ఆ నిధులను మంత్రులు, కీలక నేతలు, సన్నిహితులకు చెందిన కాంట్రాక్టుల బిల్లులను క్లియర్ చేయాలని నిర్ణయించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా వచ్చే కమీషన్లను కేరళకు రూ.వెయ్యి కోట్ల కప్పంలో జమ చేయాలనే ప్రయత్నంలో ముఖ్యనేత ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు యాసంగి, వానకాలంలో ఠంచనుగా రైతుబంధు నిధులు జమయ్యేవి. రైతులు పంట వేయడానికి ముందే ఖాతాల్లో డబ్బులు పడటంతో పెట్టుబడికి సాయంగా ఉపయోగపడేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబంధు ఆగమైంది. ఇప్పటికే రెండుసార్లు ఎగ్గొట్టగా.. తాజాగా యాసంగి ప్రారంభమై నెల గడుస్తున్నా నిధులు జమ చేయలేదు. అప్పుడు ఇప్పు డు అంటూ లీకుల వార్తలతో ఊరిస్తున్నారు తప్ప, డబ్బులు జమ చేయడం లేదు. దీంతో రైతులు విసిగిపోయి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చావుతప్పి కన్నులొట్టపోయిన తీరుగా ఫలితాలు సాధించింది. తీవ్ర ప్రజా వ్యతిరేకతను గు ర్తించిన ప్రభుత్వం.. రైతుభరోసా నిధులు జమచేసి పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. రైతుభరోసా పంపిణీ చేయాలంటే రూ.9 వేల కోట్లు అవసరం. ఇప్పటికే రైతుభరోసా కోసం ఆర్బీఐ నుంచి సరార్ రుణం తీసుకునేందుకు సిద్ధమైందని, ఆర్బీఐ ఆమోదం కూడా లభించిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఎన్నికలు లేనందున ఇప్పటికిప్పుడు రైతులతో అవసరం లేదని ముఖ్యనేత అభిప్రాయం. ఇప్పుడు రైతుభరోసా కింద రూ.9వేల కోట్లు పంపిణీ చేసినా.. మళ్లీ వానకాలంలో మరో రూ.9వేల కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని, కాబట్టి వారితో అవసరం ఉన్నప్పుడే రైతుభరోసా ఇద్దామని నిర్ణయించుకున్నట్టు చర్చ జరుగుతున్నది. మరోవైపు సంక్షేమ పథకాలకు చెల్లింపులను పూర్తిగా నిలిపేయాలని అధికారులకు హుకుం జారీ చేసినట్టు చెప్పుకొంటున్నారు.
వెయ్యి కోట్ల మూటను సర్దుబాటు చేసే క్రమంలో పైసా పైసా కూడబెడుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే బిల్లుల చెల్లింపులో కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు, కీలక నేతలు భారీఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతుభరోసా నిధులను కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు మళ్లించేందుకు ముఖ్యనేత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అది కూడా ప్రభుత్వంలోని కీలకనేతలకు సంబంధించిన కంపెనీలు, బంధువులు, అనుయాయుల కంపెనీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను మాత్రమే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. సంక్షేమ పథకాల నిధులను సైతం బిల్లుల చెల్లింపునకు మళ్లించాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. తద్వారా వచ్చే కమీషన్లతో కేరళకు వెయ్యి కోట్ల మూటను సిద్ధం చేయాలని నిర్ణయించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నిరకాల బిల్లుల చెల్లింపులు నిలిపివేసి కమీషన్ల వేటలో పడటంపై కాంగ్రెస్ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర సంక్షేమాన్ని బలిపెట్టి మరీ కేరళకు మూటలు మోస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల సంక్షేమాన్ని కూడా పక్కనబెట్టారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. లక్షల మంది రైతుల సంక్షేమం కన్నా.. అధిష్ఠానాన్ని సంతృప్తి పరచడమే ముఖ్యమా? అని మండిపడుతున్నారు.