Sri Lanka President Elections | శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మార్క్సిస్టు నేత అనురా కుమార డిస్సనాయకే జాతి ఐక్యతకు పిలుపునిచ్చారు. శ్రీలంక నూతన శకం ప్రారంభంలో సింహళులు, తమిళులు, ముస్లింలతో కూడి శ్రీలంకన్ల ఐక్యత ఉంటుందని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు నూతన శకం ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నూతన పునర్జీవనం కోసం కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. శనివారం జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో డిస్సనాయకే (55)కు 42.31 శాతం ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస నిలిస్తే, ప్రస్తుత అధ్యక్షుడు విక్రమసింఘే మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. డిస్సనాయకే ఎన్నికను శ్రీలంక ఎన్నికల సంఘం ధృవీకరించింది. సోమవారం శ్రీలంక దేశాధ్యక్షుడిగా డిస్సనాయకే ప్రమాణ స్వీకారం చేస్తారు.
శనివారం జరిగిన ఎన్నికల్లో 22 జిల్లాల పరిధిలోని 13,400కి పైగా పోలింగ్ కేంద్రాల్లో 1.70 కోట్ల మంది ఓటర్లలో 75 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డిస్సనాయకే ప్రభుత్వం.. శ్రీలంకకు ఐఎంఎఫ్ ఇచ్చిన 2.9 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.