మా ఇండ్లు కూల్చొద్దుమూసీ బాధితులకు భరోసా కల్పించేందుకు కేటీఆర్ చేపట్టిన పాదయాత్రలో హృదయం ద్రవించే ఘటన చోటుచేసుక్నుది. ‘నేను దాచుకున్న ఈ కిడ్డీ బ్యాంక్‌ను రేవంత్రెడ్డికిచ్చి మా ఇంటిని కూల్చొద్దని చెప్పండి’ అంటూ ఒక చిన్నారి.. ‘నా టెడ్డీబేర్ తీసుకొని మా ఇంటిని కూల్చవద్దని చెప్పండి’ అంటూ మరో చిన్నారి కేటీఆర్‌ను వేడుకోవడం స్థానికుల గుండెలు పిండేసింది.
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): తనకు శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే ఒప్పుకొన్నాడని, ఆ శాడిస్టిక్ ప్లెజర్తోనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కష్టపడి కొనుక్కున్న భూములు కొల్లగొట్టి, లోన్లు తెచ్చుకొని కట్టుకున్న ఇండ్లను కూల్చేసి, ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే రేవంత్‌రెడ్డికి ఉన్న శాడిస్టిక్ ప్లెజర్ అని నిప్పులు చెరిగారు.
‘శాడిస్టిక్ ప్లెజర్ ఉన్న రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇండ్లు కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నడు. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇండ్లు కూలగొట్టి పేదలను రోడ్డున పడేసిండు. రామగుండం, మహబూబ్‌నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఇండ్లు కూల్చి వేలాది మంది బతుకులను ఆగం చేసిండు’ అంటూ తూర్పారబట్టారు. మూసీ బఫర్‌జోన్ పేరిట హైదర్షా కో ట్, గంధంగూడలోని పలు కాలనీల్లో ఇండ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి న నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన మూ డున్నర కిలోమీటర్ల ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో కేటీఆర్ పాల్గొన్నారు.
మూసీ ప్రాజెక్టులో భాగంగా ఇండ్లు, భూములు, అ పార్ట్మెంట్లు కోల్పోతున్న బాధితులను కలిసి సంఘీభావం తెలిపారు. సంబంధిత కాలనీల ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ రూ.లక్షన్నర కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని మండిపడ్డారు. అభివృద్ధికి బీఆర్ఎస్ ఎప్పటికీ అడ్డుకాదని, అభివృద్ధి పేరిట ప్రజల ఇండ్లను కూలుస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ‘ప్రజల ఇండ్ల జోలికి వస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకొనైనా కాపాడుకుంటాం.. గోడలను కాదు.. సున్నం కూడా ముట్టుకోనివ్వం’ అని స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇండ్లు కూలగొట్టడం, భూములు కొల్లగొట్టడం..రియల్ ఎస్టేట్ దందా చేయడం. ఈ వ్యాపారంలో వచ్చే కమీషన్ల కోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నడు. ఇండ్లు కోల్పోతున్న బాధితులంతా చిన్నాపెద్దా తేడా లేకుండా ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా, వేడుకున్నా, చివరికి పసిపాపలపై కనికరం చూపాలని కోరినా కరశంగా ఖాళీ చేయిస్తున్నది.
– కేటీఆర్

ఇండ్లు కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడమే రేవంత్‌రెడ్డికి తెలిసిన పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చే కమీషన్ల కోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లలు ఉన్నారన్న కనికరం కూడా లేకుండా బెదిరింపులకు గురి చేస్తూ ఇండ్లు ఖాళీ చేయిస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక ప్రాజెక్టో, ఇల్లో కట్టింది లేదని, కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదని, కేవలం విధ్వంసమే తన విధానంగా ముందు కు పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇండ్లు, భూములు కాపాడుకొనే పోరాటంలో బీఆర్ఎస్ మీకు అండగా ఉంటది’ అని బాధితులకు భరోసా ఇచ్చారు.

‘కేసీఆర్ కట్టించిన అద్భుతమైన ప్రగతి భవన్ ఉన్నా ముఖ్యమంత్రి తన కోసం రూ.200 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నడు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోసం ప్రగతి భవన్‌ను కేటాయించినా హైదరాబాద్‌లో ఒక ఇల్లు, ఖమ్మం జిల్లాలో మరో ఇల్లు క్యాంపు కార్యాలయం కోసం కట్టుకుంటున్నడు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ముఖ్యమంత్రి రెండ్లు, ఉప ముఖ్యమంత్రికి మూడు ఇండ్లు కట్టుకోవచ్చు. పైసాపైసా కూడబెట్టుకొని, బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని సొంతింటి కల నెరవేర్చుకున్న పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఒక్క ఇల్లు ఉండొద్దా?’ అని కేటీఆర్ నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డికి, ఆయన అన్నదమ్ములకు మాత్రం రూ.వందల కోట్ల ఇండ్లు కావాలి కానీ పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్మెంట్ ఉండకుండా విధ్వంసం సృష్టిస్తున్నడు’ అంటూ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ కట్టించిన అద్భుతమైన ప్రగతి భవన్ ఉన్నా ముఖ్యమంత్రి తన కోసం రూ.200 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నడు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోసం ప్రగతి భవన్‌ను కేటాయించినా హైదరాబాద్‌లో ఒక ఇల్లు, ఖమ్మం జిల్లాలో మరో ఇల్లు కట్టుకుంటున్నడు. కోట్ల రూపాయల ప్రజాధనంతో ముఖ్యమంత్రి రెండు, ఉప ముఖ్యమంత్రి మూడు ఇండ్లు కట్టుకోవచ్చు కానీ పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఒక్క ఇల్లు ఉండొద్దా?
– కేటీఆర్
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కొడంగల్‌లోని రెడ్డికుంట ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నది. అన్ని అనుమతులున్న ప్రజల ఇండ్లను కాదు.. ముందుగా ముఖ్యమంత్రి ఇంటిని కూల్చాలి. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఉన్నది. ఆయన ఇంటిని ఎందుకు కూల్చడం లేదు? మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి ఇండ్లు హైదరాబాద్‌కు మంచినీళ్లు ఇచ్చే జంట జలాశయాల ఎఫ్టీఎల్లో ఉన్నయి. వారి ఇండ్లను ముందుగా కూల్చాలి. అవన్నీ చేయకుండా పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను అకారణంగా కూలుస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నరు’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.

మూసీ బాధితులకు భరోసా కల్పించేందు కు చేపట్టిన పాదయాత్రలో బాధితులు కేటీఆర్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘మా ఇండ్లను కూల్చకుండా ఆపండి అన్నా’ అంటూ మహిళలు వేడుకున్నారు. వారికి సం ఘీభావం తెలిపేందుకు వెళ్లిన కేటీఆర్‌కు ఓ చిన్నారి తన తల్లిదండ్రులిచ్చిన డబ్బును దాచుకున్న కిడ్డీ బ్యాంక్ తెచ్చి చూపుతూ ‘ ఈ కిడ్డీ బ్యాంక్ రేవంత్‌రెడ్డికి ఇచ్చి మా ఇంటిని కూ ల్చొద్దని చెప్పండి అంకుల్’ అంటూ వేడుకోవడం స్థానికులకు కన్నీళ్లు పెట్టించింది. మరో చిన్నారి తన టెడ్డీ బేర్ తీసుకొచ్చి ‘ఇది తీసుకొని మా ఇంటిని వదిలేయండి’ అంటూ కోరడం అక్కడున్నవారి కంట తడిపెట్టించింది.
పాదయాత్రలో భాగంగా కేటీఆర్ హైదర్షా కోట్, గంధంగూడ, మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో మమేకమై వారికి భరోసా కల్పిస్తూ ముందుకుసాగారు. ఆయా కాలనీల్లోకి వెళ్లి ఇండ్లు కోల్పోతున్నవారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. మహిళలు, చిన్నారులతో మాట్లాడుతూ కూల్చివేతలు జరుగకుండా కాపాడుతామని చెప్పారు. ఆయా కాలనీల్లోని ప్రజలకు ధైర్యం చెప్తూ మూడున్నర కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించారు. అందరం ఐకమత్యంగా ఉంటేనే కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోవచ్చని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎప్పటికీ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు.

పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క ఇటుక కదుపకుండా కేసీఆర్ మూసీ సుందరీకరణ చేసి చూపించారని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కేవలం రూ.16 వేల కోట్లతోనే మూసీ సుందరీకరణ చేయవచ్చని డీపీఆర్ తయారు చేసి మరీ చూపారని గుర్తుచేశారు. నాగోల్ ప్రాంతంలో మూసీని సుందరీకరించి మాడల్‌గా చూపించామని చెప్పారు. కేవలం సుందరీకరణ మాత్రమే కాకుండా రోడ్లతో పాటు ఫ్లై ఓవర్లను కూడా ప్రణాళికలో పెట్టామని తెలిపారు. మూసీ పొడవునా ఓఆర్ఆర్కు చేరుకునేందుకు అత్యంత పొడవైన ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, తన అనుచరులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ సామ్‌కు తెరలేపారని విమర్శించారు. ఇందుకు పేదల ఇండ్లను పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.లక్షన్నర కోట్ల దోపిడీ కోసం వేల మంది పేదల ఇండ్లను ధ్వంసం చేస్తూ రేవంత్ రెడ్డి కొత్త సామ్‌కు తెరలేపాడని విమర్శించారు. ‘మూసీ బఫర్‌జోన్‌కు సంబంధించి రకరకాల మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇవే అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చింది’ అని గుర్తుచేశారు. ‘నాడు అనుమతులు ఇచ్చిన అధికారులు, కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టొద్దా?’ అని నిలదీశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది.. ప్రజల ఇండ్ల జోలికొస్తే బుల్డోజర్లకు అడ్డంగా పడుకొనైనా కాపాడుకుంటం. ఓవైపు దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నదంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కొనసాగుతున్న బుల్డోజర్ రాజ్యం, కాంగ్రెస్ అరాచకాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నరు? రేవంత్‌రెడ్డి పంపిస్తున్న కట్టల సంచుల కోసమేనా?
– కేటీఆర్
మూసీ బఫర్ జోన్లో ఇండ్లు ఉన్నాయంటూ అబద్ధాలు చెప్తూ కూలగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తన సొంత మంత్రులు, తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫామ్‌హౌస్‌లు, విల్లాలు, ఇండ్లను ఎందుకు ముట్టుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు. అన్ని అనుమతులతో ఏండ్ల కిందనే కట్టుకున్న ఇండ్లు కూలుస్తున్న ప్రభుత్వానికి, నది నడబొడ్డున నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చితే ఎవరూ అడ్డురారని అనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీ బాధితుల పక్షాన కేసీఆర్ సైన్యమైన తాము నిలబడుతామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి లాంటి భూ బకాసురుడి నుంచి రాష్ర్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని పిలుపునిచ్చారు. మూసీ బాధితులకు న్యాయ పోరాటంలోనూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టు కోసం వేలమంది ఇండ్లు కూల్చడం ఆపేయాలని, తమ ఎమ్మెల్యేలు, నాయకులను పంపి బెదిరింపులకు దిగడం మానేయాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు, ఇండ్లకు బదులు డబ్బులు ఇస్తామని మోసం చేసే ప్రయత్నాలకు లొంగకుండా ఐక్యంగా ముందుకు సాగాలని మూసీ బాధితులకు
పిలుపునిచ్చారు.