Samay Raina : దివ్యాంగులపై జోక్స్ వేసిన కేసులో కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనాకు భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. సమయ్ రైనాతోపాటు మరో నలుగురు నిందితులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ, కేసును మూసి వేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, వి మోహన ఆధ్వర్యంలోని బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సమయ్ రైనాతోపాటు విపుల్ గోయల్, బాల్రాజ్ పరంజిత్ సింగ్ ఘాయ్, సోనాలి తక్కార్ అలియాస్ సోనాలి ఆదిత్యా దేశాయ్, నిశాంత్ జగదీష్ తన్వార్ అనే కమెడియన్లకు కూడా కేసు నుంచి విముక్తి లభించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. నవంబర్ 14న సమయ్తోపాటు పలువురు కమెడియన్స్ ఇండియాస్ గాట్ టాలెంట్ అనే షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులపై కొన్ని అనుచితమైన జోక్స్ వేశారు. అలాగే, స్పైనల్ మస్క్యులర్ డిస్ట్రోఫి (ఎస్ఎంఏ) అనే వ్యాధితో బాధపడుతున్నవారిపై కూడా కొన్ని జోక్స్ వేశారు. దీంతో దివ్యాంగులను కించపరిచేలా జోక్స్ వేసి, వారి మనోభావాలు దెబ్బతీశారంటూ కమెడియన్స్పై కేసు నమోదైంది. క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ (ఎన్జీవో) వారు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్యాంగుల హక్కులు, గౌరవానికి భంగం కలిగించేలా సమయ్, మిగతా కమెడియన్లు ప్రవర్తించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై గతంలో విచారణ జరిపిన కోర్టు కమెడియన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో వారికి శిక్ష విధించకుండా కొన్ని సూచనలు చేసింది. ప్రత్యేక ఈవెంట్లు ఏర్పాటు చేసి, షోస్ చేసి, వచ్చిన నిధుల్ని దివ్యాంగుల కోసం కేటాయించాల్సిందిగా సూచించింది. ఇదే సమయంలో అలాంటి సమస్యల్తో బాధపడుతున్న వారిని తమ షోకు ఆహ్వానించాలని కమెడియన్లకు సూచించింది. అలాగే, ఒక్కొక్కరూ కోర్టు ఖర్చుల కింద రూ.3 లక్షలు చెల్లించాలని అప్పట్లో ఆదేశించింది. అయితే, ఇప్పుడు వారి విషయంలో కోర్టు నిర్ణయం మార్చుకుంది. వీరిపై కేసువేసిన స్వచ్ఛంద సంస్థ తాజాగా కోర్టుకు వెల్లడించిన వివరాలే ఇందుకు కారణం. స్వచ్ఛంద సంస్తతో కలిసి షోస్ నిర్వహించేందుకు, నిధులు సేకరించేందుకు కమెడియన్స్ అంగీకరించారని సంస్థ కోర్టుకు తెలిపింది. అలాగే, ఎస్ఎంఏ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పిచేందుకు, ఈ సమస్యతో బాధపడుతున్న వారిని షోకు ఆహ్వానించేందుకు వారు అంగీకరించినట్లు వివరించింది.
దీంతో ఈ వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. యువతకు సరైన దారిలో వెళ్లేందుకు అవకాశాలివ్వాలని, సమయ్ రైనా సహా మిగతా కమెడియన్లు సరైన దిశలో పని చేయడం మొదలుపెడితే ఫలితాలు కూడా అదే కోవలో వస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. స్వచ్ఛంద సంస్థతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంగీకరించడంపై సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. వారిపై నమోదైన కేసును కొట్టివేసింది. వారికి గతంలో టీవీ షో ద్వారా వచ్చిన నిధుల్ని దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా కేటాయించాలని కోర్టు సూచించింది.