సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ అవసరాల కోసం మంజూరైన విద్యుత్ కనెక్షన్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తూరులో వ్యవసాయానికి ఉద్దేశించిన విద్యుత్‌ను పారిశ్రామిక అవసరాలకు వాడుతున్నారంటూ రైతులు స్వయంగా చిత్రీకరించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొత్తూరులో ఒక పరిశ్రమకు కమర్షియల్ కరెంట్ తీసుకున్నప్పటికీ అగ్రికల్చర్ ఫీడర్ ద్వారానే కరెంట్ వాడుతున్నారు.
ఈ పరిశ్రమలో ట్రాక్టర్లకు సంబంధించిన వివిధ రకాల పరికరాలను తయారు చేయడం, మరమ్మతులు చేయడం పాటు పెద్ద పెద్ద యంత్రాలను వాడుతుండడంతో విద్యుత్ వినియోగం అధికంగా జరుగుతోంది. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో ఉన్న మూడు హోటళ్లు విద్యుత్ స్తంభం నుంచి కరెంట్‌ను అక్రమంగా వాడుతున్నారు. హెచ్‌టీ వినియోగదారులు తమకు నిర్దేశించిన కేటగిరీలోనే కరెంట్‌ను వాడాల్సింది పోయి నిబంధనలకు విరుద్దంగా వ్యవసాయ కరెంట్‌ను వాడుతున్నారు. ఈ విషయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్కడే ఉన్న మరికొన్ని హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు కరెంట్‌ను అక్రమంగా వాడుతుండడంతో డీటీఆర్లపైలోడ్ పెరుగుతుంది.
ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ వినియోగం, మరోవైపు అధికలోడ్‌తో అప్రకటిత విద్యుత్ కోతలతో రైతాంగం ఆందోళన చెందుతుంటే ఈ అక్ర మ విద్యుత్ కనెక్షన్ల వ్యవహారం వారికి మరింత ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ విషయంపై అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ముఖ్యంగా బాహాటంగానే వ్యవసాయ కరెంట్‌ను పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తుంటే కనీసం క్షేత్రస్థాయి సిబ్బంది కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక ఆర్టిజన్ నుంచి ఎస్ఈ స్థాయి అధికారుల వరకు సెక్షన్ల వారీగా ముడుపులు ముడుతున్నాయం టూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా శివారు ప్రాంతాలు కావడంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ తక్కువగా ఉంటుంది. దీంతో స్థానిక అధికారులు ప్రత్యేకించి ఏఈ, ఏడీఈ స్థాయి అధికారులు లైన్మెన్లు, ఆర్టిజన్లతో కలిసి ఇటువంటి అక్రమాలకు వంత పాడుతున్నారంటూ విమర్శలు ఉన్నాయి. అయితే తుమ్మలూరు మహేశ్వరంలోని కర్నాటి దేవేందర్ అనే వ్యక్తికి చెందిన పరిశ్రమలో కమర్షియల్ మీటర్ ఉందని, అగ్రికల్చర్ ఫీడర్ నుంచి కరెంట్ వాడుతున్న మాట వాస్తవమేనని మామిడిపల్లి ఏడీఈ శంకర్ తెలిపారు. దీంతో పాటు ప్రస్తుతం 24గంటల సరఫరా కోసం తాను మళ్లీ కనెక్షన్ తీసుకున్నాడని, త్వరలోనే ఈ మీటర్‌ను తొలగిస్తామని చెప్పారు.
డీటీఆర్ పనిచేయదు..
ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు ఎండలతో పంటను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. ఇలాంటి సమయంలో వ్యవసాయ విద్యుత్‌ను ఇతర అవసరాలకు మళ్లిస్తే వ్యవసాయ ఫీడర్లపై అదనపులోడ్ పడుతున్నదంటూ స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్ ట్రిప్పింగులు, వోల్టేజి సమస్యలు, డీటీఆర్లు దెబ్బతినడం మూలాన కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నదని, అంతేకాకుండా డీటీఆర్లు మరమ్మతులు కూడా కష్టమవుతున్నట్లు వారు చెప్పా రు. పంటలకు సరైన సమయంలో విద్యుత్ అందకపోవడం వల్ల తాము నష్టపోతున్నట్లు రైతులు వాపోయారు. ప్రస్తుతం కొత్తూరు గ్రామంలో డీటీఆర్ పనిచేయడం లేదు.
పంటలకు నీరు అందించాల్సిన సమయంలో విద్యుత్ లేకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని వారు తెలిపారు. డీటీఆర్లు పాతవి కావడం, కొత్తవి కావాలని అడిగినా స్టోర్స్‌లో మెటీరియల్ లేకపోవడంతో చాలా మంది రైతులకు సమస్యగా మారింది. ఈ ఒక్క డీటీఆర్ పరిధిలో 30 నుంచి 40మంది రైతులు సాగు చేస్తుండగా వారందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసినా మళ్లీ పరిశ్రమలు, వాణిజ్యసంస్థలు ఈ పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్ సరఫరానే వినియోగిస్తుండడంతో లోడ్ పెరిగి ఫీడర్లు దెబ్బతింటున్నాయి. ఈ అక్రమ కనెక్షన్ల వ్యవహారంపై విజిలెన్స్ విచారణ చేపట్టి సీఎండీ జితేశ్ పాటిల్ చర్యలకు పూనుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.