Foreign Portfolio Investors | ఈ నెలలో ఇప్పటి వరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ. 33,700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకోవడం, భారత్ మార్కెట్లో వృద్ధి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ పీఐ పెట్టుబడులు పెరగడానికి కారణమైంది. ఈ ఏడాదిలో ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెట్టడం రెండో నెల. ఇంతకుముందు గత మార్చిలో రూ.35,100 కోట్ల విలువైన పెట్టుబడులు ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మదుపు చేశారు.
ఇదే ధోరణి ఇక ముందు కూడా కొనసాగుతుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటర్జిస్ట్ వీకే విజయ్ కుమార్ అంచనా వేశారు. డిపాజిటరీల నుంచి వచ్చిన డేటా ప్రకారం విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెల 20 వరకు నికరంగా రూ.33,691 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ రూ.76,572 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ ఫీఐలు మదుపు చేశారు. జూన్ నుంచి నికరంగా ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ పీఐలు షేర్ల కొనుగోళ్లు నికరంగా కొనసాగుతూ వచ్చాయి. ఏప్రిల్, మే నెలల్లో రూ.34,252 కోట్ల విలువైన షేర్లను ఎఫ్ పీఐలు కొనుగోలు చేశారు.