హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఓ మంత్రి చేతి లో కీలుబొమ్మగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సదరు మంత్రి అక్రమాల ఇన్నింగ్స్ మొదలుపెట్టారన్న చర్చ నడుస్తున్నది. పాత అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించి తనకు ఎదురు లేకుండా చేసుకున్నారని, ఏడాదికి రూ.200 కోట్ల లావాదేవీలున్న హెచ్‌సీఏలో ఇప్పుడు సదరు మంత్రి ఏం చెప్తే అదే జరుగుతున్నదని టాక్ వినిపిస్తున్నది. పాత అధ్యక్షుడి మీద మోపిన అభియోగాలపై చార్జిషీట్ దాఖలు కాకముందే అనర్హత వేటు వేయించి కొత్త అధ్యక్షుడిని తీసుకువచ్చారు. పోనీ కొత్త అధ్యక్షుడైనా అసోసియేషన్‌ను ప్రక్షాళన చేస్తారేమో అని క్రికెట్ అభిమానులు ఆశిస్తే.. ఆయన మాత్రం మంత్రి కనుసన్నల్లో మెదులుతూ పావులు కదపటం మొదలుపెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే హెచ్‌సీఏపై ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి కన్నుపడిందనేది బహిరంగ రహస్యం. ఎన్నో ప్రయత్నాల తర్వాత.. ఎట్టకేలకు దాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారని క్రికెట్ అభిమానుల్లో చర్చ జరుగుతున్నది. అప్పటి నుంచి ఆ మంత్రి ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతున్నదని విమర్శిస్తున్నారు. పాత పాలకవర్గంలోని అధ్యక్షుడు, కోశాధికారి, కార్యదర్శి మీద అవినీతి ఆరోపణలు మోపి, వారిని పదవి నుంచి తొలగించారని చెప్తున్నారు. హెచ్‌సీఏ బైలాస్ ప్రకారం కొద్దికాలం తాత్కాలిక అధ్యక్షుడితో నెట్టుకొచ్చారని, అయితే ఆయన మంత్రి చెప్పినట్టు వినకపోవడంతో ‘ప్లాన్ బీ’ ప్రయోగించినట్టు హెచ్‌సీఏ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
2023లో హెచ్‌సీఏ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అమర్నాథ్పై జగన్మోహన్రావు గెలిచారు. అయితే హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఫోర్జరీ పత్రాలతో జగన్మోహన్ రావు పోటీ చేశారని అమర్నాథ్ తాజాగా ఫిర్యాదు చేశారు. దీనిపై అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్‌కుమార్ కైత్ విచారణ చేపట్టారు. జగన్మోహన్రావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చారు. పాత పాలక వర్గం పదవీకాలం ఇంకా 9 నెలలు ఉన్నందున, సంస్థ కార్యకలాపాలు ఆగిపోకూడదని పేర్కొంటూ 2023 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్నాథ్ను అధ్యక్షునిగా ప్రకటించారు. వారం రోజుల్లో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అంబుడ్స్‌మన్ నిర్ణయాన్ని జగన్మోహన్రావు, ఆయన తరుపు న్యాయవాదులు తప్పు పడుతున్నారు. అంబుడ్స్‌మన్ తన పరిధిని మించి నిర్ణయం తీసుకున్నారని, చార్జిషీట్ దాఖలు కాకముందే అనర్హత వేటు వేయడం, మరో వ్యక్తిని నియమించటం చట్టవిరుద్ధమని పేర్కొంటున్నారు. సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం వివాదాలను సివిల్ కోర్టు తేల్చాలని అంబుడ్స్‌మన్ నిర్ణయం సరికాదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు
కొత్త అధ్యక్షుడు వచ్చి రావటంతోనే తన మార్కు రాజకీయం చేస్తున్నారని హెచ్‌సీఏ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలకు ఫిబ్రవరి 28న నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. హెచ్‌సీఏ బైలాస్‌లోని 6వ అధ్యాయం, క్లాజ్ 33 ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి ముందుగా సర్వసభ్య సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని, దానికి కనీసం నాలుగు వారాల ముందు ఎన్నికల అధికారిని నియమించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల అధికారిని ఫిబ్రవరి 16న నియమించారని చెప్తున్నారని, ఈ లెక్కన నిబంధనల ప్రకారం మార్చి 16వ తేదీ కంటే ముందు జనరల్ బాడీ సమావేశం నిర్వహించరాదని స్పష్టం చేస్తున్నారు. అయినా ముందే షెడ్యూల్ చేయడమంటే బైలాస్‌లో సూచించిన ‘తప్పనిసరి కనీస కాల వ్యవధి’ నియమానికి విరుద్ధమని పేర్కొన్నారు. అదేవిధంగా హెచ్‌సీఏ బైలాస్ 3, క్లాజ్ 8.4 ప్రకారం జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సభ్యులకు కనీసం 21 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని చెప్తున్నారు. కానీ నోటీసు ఇవ్వకుండానే ఏకపక్షంగా ఎన్నికల నోటీసు విడుదల చేయడాన్ని సభ్యులు తప్పుపడుతున్నారు.