American Airlines : ఆకాశంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) కు చెందిన రెండు విమానాల (Two flights) కు పెను ప్రమాదం తప్పింది. రెండింటికి ఒకటే నంబర్ ఉండటంతో అవి ఒకే మార్గంలోకి వచ్చి దాదాపు ఢీకొన్నంత పని అయ్యింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (Air Traffic Controller) చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం ఫీనిక్స్ ప్రాంతంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు గాల్లో ఎదురెదురుగా వచ్చాయి. ఫీనిక్స్ స్కైహార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. అందులో ఒక బోయింగ్ విమానం షికాగో నుంచి వస్తుండగా.. మరో విమానం అప్పుడే ఫీనిక్స్ నుంచి బయల్దేరింది. రెండింటికి ఒకటే ఫ్లైట్ నంబర్ ఉండటం (అమెరికన్ 2482), ప్రతికూల వాతావరణంవల్ల షికాగో విమానం ఆలస్యం కావడం రెండు విమానాలు ఒకే లైన్లోకి రావడానికి కారణమయ్యాయి.
వేర్వేరు మార్గాల్లో వెళ్లే విమానాలకు ఎయిర్‌లైన్స్ ఇలా ఒకే నంబర్ ఇవ్వడం సాధారణమే. అయితే ఒకే కాల్ సైన్ ఉన్న విమానాలు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ఉండటం మాత్రం అరుదుగా జరుగుతుంది. షెడ్యూలింగ్ పొరపాటు కారణంగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ అసాధారణ పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గుర్తించారు. అరైవల్, డిపార్చర్లో ఉన్న విమానాలకు వెంటనే వేర్వేరు సూచనలు చేశారు. అరైవల్‌లో ఉన్న విమానాన్ని ఎక్కువ ఎత్తు తీసుకోమని, డిపార్చర్లో ఉన్న విమానాన్ని తక్కువ ఎత్తులో ప్రయాణించమని సూచించారు.
ఆ సూచనకు తగ్గట్టుగానే పైలట్లు తమతమ మార్గాలను మార్చుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. తాను 25 ఏళ్లుగా ఈ విధులు నిర్వర్తిస్తున్నానని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని కంట్రోలర్ చెప్పారు. అయితే ఈ భద్రతాలోపంపై దర్యాప్తు జరుగుతున్నది.